ఫుల్‌ పటాస్‌!

9 Nov, 2018 07:51 IST|Sakshi

రూ.4 కోట్ల మద్యం విక్రయాలు

మందుబాబులకు తాకని ‘తిత్లీ’

ఆఖర్లో బాణసంచాకు డిమాండు

రూ.3 కోట్ల వరకూ విక్రయాలు

ఎలక్ట్రానిక్స్‌ బిజినెస్‌ అంతంతే

రోడ్డెక్కని కొత్త వాహనాలు!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  గతనెల 10వ తేదీ రాత్రి తిత్లీ తుపాను జిల్లాతీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. దీని దాటికి దాదాపు పది లక్షల వరకూ కొబ్బరి చెట్లు కూలిపోయాయి. దాదాపు లక్ష ఎకరాల్లో వరి నష్టం జరిగింది. ఫలసాయం చేతికొచ్చే సమయంలో తుపాను విరుచుకుపడటంతో రైతులతో పాటు అన్ని వర్గాలవారు నష్టపోయారు. తుపానుకు కూలిపోయిన కొబ్బరిచెట్లు, జీడిమామిడి చెట్లు ఇంకా ఎండిపోయి అలానే ఉన్నాయి. వాటిని తొలగించే కార్యక్రమం ఇంకా ఊపందుకోలేదు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ చేసుకోవడానికి జిల్లా ప్రజలు ముఖ్యంగా ఉద్దానం ప్రాంతీయులు ఆసక్తి చూపించలేదు. దీంతో బాణసంచా విక్రయదారులు కూడా తొలుత దుకాణాలు ఏర్పాటు చేయడానికే సంశయించారు. కానీ పండుగ మూడురోజులు ఉందనగా ఒకేసారి విక్రయాలు ఊపందుకున్నాయి.

కృత్రిమ డిమాండుతో బాదుడు...
తుపాను నేపథ్యంలో బాణసంచా కొనేవారే ఉండరని అంతా భావించారు. ధరలు కూడా పెద్దగా ఉండవని కొనుగోలుదారులు ఆశించారు. కానీ ఆదివారం నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం డివిజన్‌లో 34, పాలకొండ డివిజన్‌లో 4 దుకాణాలు ఏర్పాటు చేశారు. తుపాను తీవ్రంగా ఉన్న టెక్కలి డివిజన్‌లో ఏడు దుకాణాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. మొత్తం 45 దుకాణాల్లో రూ.3 కోట్ల వరకూ బాణసంచా వ్యాపారం జరిగిందని అంచనా. అయితే బాణసంచా సామగ్రి ధరలు మాత్రం సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. చివరకు దీపావళి రోజు సాయంత్రం కూడా ఇవేవీ దిగిరాలేదు. కృత్రిమ డిమాండు సృష్టించి వ్యాపారులే ధరలు పెంచేశారని కొనుగోలుదారులు వాపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం పిల్లల సరదాను కాదనలేకే ఎక్కువ ధరలకైనా బాణసంచా కొనుగోలు చేస్తున్నామని పలువురు వ్యాఖ్యానించడం ధరల పరిస్థితికి అద్దం పడుతోంది. 2016 సంవత్సరంలో దీపావళికి 43 దుకాణాల్లో రూ.2.50 కోట్ల మేర వ్యాపారం జరిగింది. గత ఏడాది 46 దుకాణాలు ఏర్పాటు చేస్తే రూ.2.75 కోట్ల వరకూ చేరింది. ఈసారి మాత్రం 45 దుకాణాల్లో రూ.3 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

మందుబాబుల ఖుషీ...
దసరాతో పోల్చితే దీపావళికి మద్యం విక్రయాలు తక్కువే. కానీ ఈసారి తిత్లీ తుపాను దెబ్బతో దసరా పండుగకు కూడా మద్యం దుకాణాలు వెలవెలబోయాయి. కానీ దీపావళికి మాత్రం మందుబాబుల ఖుషీ పెరిగింది. దాదాపు రూ.4 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు అంచనా. 2016 దీపావళికి జిల్లాలోని 238 మద్యం దుకాణాల్ల రూ.2.80 కోట్ల వ్యాపారం జరిగింది. అదే గత ఏడాది 3.90 కోట్లకు పెరిగింది. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి మాత్రం మద్యం విక్రయాలు పెరిగాయి.

ఊపందుకోని ఎలక్ట్రానిక్స్,ఆటోమోబైల్స్‌...
దీపావళికి ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, ఆటోమోబైల్స్‌ వ్యాపారం కూడా బాగానే జరగాల్సి ఉంది. తిత్లీ తుపాను ప్రభావంతో ఈ దుకాణాలు వెలవెలబోయాయి. ఫ్రిజ్‌లు, టీవీల ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే ఎక్కువగానే ఉండటంతో కొనుగోలుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అలాగే ద్విచక్ర వాహనాలు, వ్యాన్‌లు, ఆటోల కొనుగోళ్లు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇక కొత్త మొబైల్స్‌ వ్యాపారం పరిస్థితి అంతంతే. మొబైల్‌ ఫోన్ల కొనుగోళ్లపై ఆఫర్లు కూడా ప్రకటించినా ఫలితం లేకపోయింది. ఏదిఏమైనా జిల్లావ్యాపార రంగంపై తిత్లీ తుఫాను ప్రభావం కనిపించింది. 

మరిన్ని వార్తలు