నలుగురు మావోయిస్టుల అరెస్ట్‌ 

14 Oct, 2018 02:05 IST|Sakshi

అరకులోయ/మల్కన్‌గిరి: ఒడిశా కటాఫ్‌ ప్రాంతంలోని ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పట్టుబడిన నలుగురు మావోయిస్టుల నుంచి పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ ముగ్గురు మహిళా మావోయిస్టులు, ఓ మిలీషియా సభ్యుడి ఫోటోలను మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గా మోహన్‌ మిన్నా శనివారం మీడియాకు వెల్లడించారు. ఆండ్రపల్లి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యుడిగా పనిచేస్తున్న రాజశేఖరకర్మతో పాటు జంత్రి గ్రామానికి చెందిన పార్టీ సభ్యులు జయంతి గొల్లూరి (20), రాధిక (20), సుమ గొల్లూరి (17)గా పోలీసులు గుర్తించారు. వారి కిట్‌ బ్యాగ్‌ల నుంచి 3 జిలెటిన్‌లు, 2 క్రోడాక్స్, వైరు, 2 టిపెన్‌బాక్స్‌ బాంబులు, ఎలక్ట్రీకల్‌ వైరును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. 

గాయాలపాలైన పోలీసులకు పాడేరులో చికిత్స 
కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా మృతదేహంతోపాటు, పట్టుబడిన మావోయిస్టులను గ్రేహౌండ్స్‌ పోలీసులు తరలిస్తున్న సమయంలో కొంతమంది గిరిజనులు అడ్డుకుని పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పలువురు గ్రేహౌండ్స్‌ పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివచ్చారు. గాయపడిన 11 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులకు పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించారు.  కాగా, ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు నిడి గొండ ప్రమీల ఉరఫ్‌ మీనా మృతదేహాన్ని శనివారం ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు.  

మరిన్ని వార్తలు