సిఫార్సు దర్శనం.. రాబడికి ఆటంకం

23 Feb, 2019 11:44 IST|Sakshi
పాలకమండలి సభ్యుల అనుచరులను వీఐపీ గేటు నుంచి దర్శనానికి తీసుకువెళుతున్న చైర్మన్‌ కార్యాలయ ఉద్యోగి

ఉచిత దర్శనాలకు తెరతీసిన పాలక మండలి

ఒకరోజులోనే 189 మందికి శీఘ్రదర్శనం

అడ్డుకున్న సిబ్బందికి ఫోనులోనే బెదిరింపులు

నూతన పాలకవర్గం.. అత్యుత్సాహం.. అయినవారికి.. కానివారికి సిఫార్సులతో వీఐపీ దర్శనం ఉచితం.. అడిగిన సిబ్బందికి బెదిరింపులు.. చేష్టలుడిగిన ఉద్యోగులు.. వెరసి ఆలయ ఖజానా రాబడికి గండి. ఫలితం ఆలయాభివృద్ధికి ఆటంకం. ఇదీ కాణిపాకంలో దర్శనాల పరిస్థితి.

కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానంలో పాలక మండలి సభ్యులు  ఉచిత దర్శన సిఫార్సులతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. ఒక్క రోజులోనే 189 మందిని శీఘ్రదర్శనానికి పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పంపడం కుదరదన్న సిబ్బందికి ఫోనులోనే ఓ పాలక మండలి సభ్యుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. మరో వైపు ఆగమశాస్త్రం విరుద్ధంగా గర్భాలయంలోకి సైతం తమ అనుచరులను తీసుకు వెళ్లి, దర్శనాలు చేయిస్తున్నారు. 

కంచె చేను మేస్తే ...
పాలకమండలి ముఖ్యఉద్దేశం ఆలయాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కావాలి. కానీ కంచె చేను మేసే చందాన తయారైంది కాణిపాకం దేవస్థానం పరిస్థితి. రద్దీ సమయాల్లో పాలకమండలి సభ్యులు వందల మందిని ఉచితంగా దర్శనాలకు పంపుతున్నారు. ప్రధానంగా చైర్మన్‌ కార్యాలయం నుంచి నలుగురు దేవస్థానం సిబ్బంది, నలుగురు హోంగార్డులను విధుల్లో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి 8 మంది పాలక మండలి సభ్యుల ప్రాంతాల నుంచి, వారి అనుచరులు ఎవరు వచ్చి నా ఉచితంగా వినాయకస్వామి దర్శనం చేస్తున్నారు.

ఉదాహరణకు శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు కుప్పం నుంచి వివాహ బృందం 32 మంది రూ.వంద క్యూ ద్వారా శీఘ్ర దర్శనం కల్పించారు. తద్వారా రూ 3,200 దేవస్థానానికి నష్టం వాటిల్లింది. అలాగే చైర్మన్‌ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వెం కటరమణ(పేరు మార్చడం జరిగింది) 89 మందిని విడతల వారీగా దర్శనానికి తీసుకువచ్చారు. వారిని వీఐపీ ద్వారం నుంచి దర్శనానికి పంపారు. దీంతో ఆలయ ఖజానాకు రూ.8,900 నష్టం.
ఇక చైర్మన్‌ ముఖ్య అనుచరుడు (బొమ్మ సముద్రం ప్రాంతానికి చెందిన వ్యక్తి ) మూడు విడతలుగా 19 మందిని వీఐపీ ద్వారం నుంచి దర్శనం చేయించారు. తద్వారా ఖజానాకు రూ.1,900 నష్టం.
ఇక పలువురి పాలక మండలి సభ్యుల పేరుతో సాయంత్రం వరకు 42 మందికి పైగా వీఐపీ దర్శనాలు చేసుకున్నారు. ఒక్కొక్క  (రూ.500) ఆశీర్వాదం టికెట్‌తో ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు. ఈ లెక్కన రూ.10,500 ఖజానాకు నష్టం. ఇలా ఒకరోజులోనే దాదాపు రూ.24, 500 ఖజానాకు నష్టం.

ఆగమ శాస్త్రవిరుద్ధంగాగర్భాలయ దర్శనం
కాణిపాకం దేవస్థానంలో వీవీఐపీలకు మాత్రమే అది కూడా సంప్రదాయ దుస్తులతోనే గర్భాలయ దర్శనానికి అనుమతిస్తారు. ప్రస్తుత పాలక మం డలి సభ్యులు తమ అనుచరులను ఆగమ శాస్త్రాల విరుద్ధంగా సంప్రదాయాలు పాటించకుండా ష ర్టు, జీన్సు, ప్యాంట్లతో గర్భాలయ దర్శనాలు చే యిస్తున్నారు. ఇటీవలా హైదరాబాద్‌కు చెందిన టైల్స్‌ వ్యాపారి, సినీ నిర్మాత వారి కుటుంబానికి గర్భాలయ దర్శనం పాలక మండలి సభ్యులు చే యించారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధి కారులు ఈఓ దృష్టికి తీసుకువెళుతున్నట్లు సమాచారం. ఆయన కూడా పాలకమండలి, అందులో అధికార పార్టీ నేతలతో ఎందుకులే? అని మిన్నకుండి పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఉచిత దర్శనాలకు అడ్డుకట్ట వేస్తాం
దేవస్థానంలో ఉచిత దర్శనాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాం. దేవస్థాన సిబ్బంది ఎవరి నైనా దర్శనానికి తీసుకు వెళితే కచ్చితంగా ఈఓ కార్యాలయం అనుమతి తీసుకోవాలి. అలా కా దని ఎవరైనా దర్శనాలకు తీసుకువెళితే కచ్చి తంగా చర్యలు తీసుకుంటాం. గర్భాలయ దర్శనాలు చేయించాలంటే తప్పకుండా ఆలయాధికారులు అనుమతి ఉండాలి.– పి.పూర్ణచంద్ర రావు, ఈఓ, కాణిపాకం 

మరిన్ని వార్తలు