ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో అపశ్రుతి

3 Aug, 2015 01:57 IST|Sakshi
ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో అపశ్రుతి

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం
రిసార్ట్స్‌లో స్నానం చేస్తుండగా ఒకరు
పులిచింతల లో మునిగి మరొకరు

 
స్నేహితుల దినోత్సవంనాడు జిల్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రాంతాలకు స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఇద్దరూ స్నానం చేసేందుకు నీటిలో దిగి ప్రాణాలు పోగొట్టుకోవడం గమనార్హం. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులో దిగి మృత్యువాత పడగా, మరో ఘటనలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన విద్యార్థి కంచికచర్ల మండలం పరిటాల వద్ద ఒక రిసార్ట్స్‌లోని స్విమింగ్ పూల్‌లో దిగి ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీంతో వారి  స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.
 
కంచికచర్ల: ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితులతో ఫ్రెండ్‌షిప్ డేను ఆనందంగా జరుపుకొందామని వచ్చి స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈత కొడుతూ ఊపిరాడక మునిగి మృత్యువాత పడిన ఘటన కంచికచర్ల మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ నాల్గవ సంవత్సరం చదువుతున్న చిలకలూరిపేటకు చెందిన జి.బాలశంకర్ (21)తోపాటు బత్తుల సంఘమిత్ర (రాజోలు), కిరణ్‌కుమార్(మదినేపల్లి), శివ (గుడివాడ), పిల్లి గోపి (పెదకూరపాడు), లింగాల వెంకటయ్య (కారంపూడి) తేజ వివిధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరంతా ఫ్రెండ్‌షిప్ డేను ఆనందంగా జరుపుకొందామని కంచికచర్ల మండలం పరిటాలలోని 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఉమా రీసార్ట్‌కు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు.

అయితే వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు మద్యం తాగారు. అనంతరం రిసార్ట్స్‌లో ఉన్న స్విమ్మింగ్‌ఫూల్‌లో స్నానం చేసేందుకు వెళ్లారు. ఆ ఈత కొలను నాలుగు అడుగుల నుంచి తొమ్మిది అడుగుల లోతు వరకు ఉంటుంది. కొలనులో స్నానం చేసే సమయంలో బాలశంకర్ తొమ్మిది అడుగులో లోతులోకి వెళ్లడంతో అతనికి ఊపిరాడలేదు. ఇదంతా గ్రహించిన తోటి స్నేహితులు బాలశంకర్‌ను ఈత కొలను నుంచి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించి అనంతరం సమీపంలో ఉన్న ఓ వాహనంలో వైద్యం కోసం  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కె.ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 
శోకసంద్రంలో ఖాదర్ కుటుంబం..
 జగ్గయ్యపేట/అచ్చంపేట (గుంటూరు) : గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ (29) ఆదివారం స్నేహితులతో కలిసి గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.  పదేళ్ల కిందటే ఖాదర్ తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు ఖాదరే చూసుకుంటున్నాడు. అతడితో పాటు అతని సోదరుడు, తల్లి, భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామంలోని ఒక రీబటన్ టైర్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో గ్రామానికి చెందిన 8 మంది స్నేహితులతో కలిసి గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి కృష్ణానదీలో స్నానం చేసేందుకు దిగారు. ఖాదర్‌కు ఈత రాకపోవడంతో ఒక్కసారిగా మునిగిపోయాడు. ఆరు నెలల గర్భిణి అయిన అతడి భార్యను ఓదార్చటం ఎవరి తరం కావడం లేదు.

మరిన్ని వార్తలు