దేశ రక్షణ విషయంలో సంపూర్ణ మద్దతు

15 Jul, 2017 01:21 IST|Sakshi
దేశ రక్షణ విషయంలో సంపూర్ణ మద్దతు
- వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడి 
- సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అఖిలపక్ష భేటీ
 
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొనే అన్ని నిర్ణయాలకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పార్టీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలపై శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాసంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ఆరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌.జైశంకర్, అన్ని పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ తరపున సమావేశంలో పాల్గొన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు,  కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాద దాడులు వంటి అంశాలను సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. చైనాతో నెలకొన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఉన్న అవకాశాలను అన్వేషించాలని అన్ని పార్టీలు సూచించాయన్నారు. దేశ రక్షణ విషయంలో కేంద్రం తీసుకొనే అన్ని నిర్ణయాలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేశామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ తరపున ఎంపీ తోట నరసింహం, టీఆర్‌ఎస్‌ తరపున ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు