ఆయేషాకు ఆర్థికసాయం

17 Aug, 2018 13:20 IST|Sakshi
చెన్నైలో చిన్నారి తల్లిదండ్రులకు నగదు అందజేస్తున్న దృశ్యం

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట: కడపలోని రాజీవ్‌ గాంధీనగర్‌కు చెందిన ఆయేషా(8) చిన్ని వయసులోనే పెద్ద వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఉన్నట్టుండి కోమాలోకి వెళుతోంది. కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.40లక్షలు అవసరం అవుతాయి. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయంపై ఈ నెల5న అయ్యో ఆయేషా శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది.

దీంతో అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల (ఏఐటీఎస్‌) విద్యార్థులు షేక్‌మస్తాన్, షేక్‌ ఖాదర్‌వల్లి  స్పందించారు. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం వారు మాట్లాడుతూ ఆయేషాకు లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం ఆర్థిక సాయం అందించాలని భావించామన్నారు.తమ నగదుతోపాటు రాజంపేట పట్టణంలోని కాకతీయ, నలందా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించామన్నారు. ఈ విధంగా వచ్చిన రూ.50వేలను ఆయేషా తల్లిదండ్రులకు అందజేసినట్లు వివరించారు. ప్రస్తుతం చిన్నారి చెన్నైలోని ఎగ్మోర్‌పరిధిలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పోందుతోందని చెప్పారు.

మరిన్ని వార్తలు