ఎన్నాళ్లీ గజగజ!

3 Nov, 2014 03:33 IST|Sakshi
  • దశాబ్దాలుగా తీరని ఏనుగుల సమస్య
  •  తరచూ పంట పొలాలపై దాడులు
  •  అడవిని వదిలి ప్రాణాలు కోల్పోతున్న ఏనుగులు
  •  మూడు రాష్ట్రాల కారిడార్ ఎప్పుడో?
  • పలమనేరు: జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో దశాబ్దాలుగా గజరాజుల దాడులతో రైతు లు నష్టపోతూనే ఉన్నారు. పంట పొలాల వైపునకు ఏనుగులు రాకుండా అటవీ శాఖ సోలార్ ఫెన్సింగ్ నిర్మించినా లాభం లేకపోతోంది. ఏటా వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతూనే ఉంది. రైతుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లింది. ఏనుగులు సైతం మృత్యువాత పడుతున్నాయి.
     
    నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

    పంటలను ధ్వంసం చేసే ఏనుగు గుంపులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో 1984లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదు. లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం చూపుతుండడంతో ఏనుగులు పంటలను నాశనం చేస్తూనే ఉన్నాయి. పొలాల వద్ద కాపలా ఉన్న మనుషులను కూడా చంపేస్తున్నాయి.
     
    అసలు సమస్య ఇదీ

    పలమనేరు, కుప్పం పరిధిల్లోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర వ్యాపించి ఉంది. ఇందులో 36 ఏనుగులున్నట్లు అటవీ శాఖ చెబుతోంది. ఇవి అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం బంగారుపాళెం మం డలం నుంచి కుప్పం వరకు 230 కి.మీ. మేర సోలార్ ఫెన్సింగ్‌ను రెండు దఫాలుగా ఏర్పా టు చేసింది. 40 కి.మీ. మేర ఏర్పాటు చేయాల్సి ఉంది. పలుచోట్ల ఫెన్సింగ్ ఇప్పటికే దెబ్బతింది. వీటిని పర్యవేక్షించేందుకు లైన్ వాచర్లను ఏర్పాటు చేసినా వారు పట్టించుకోవడం లేదు. అడవిలో మేత, నీటిసౌకర్యం లేకపోవడంతో ఏనుగులు ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి మరీ పొలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 225 ఎకరాల్లో ఏనుగులు పంటను ధ్వంసం చేసినట్టు అధికారుల అంచనా.
     
    అడవిని వదిలి ప్రాణాలు కోల్పోతున్న ఏనుగులు

    అడవి నుంచి బయటకొచ్చే ఏనుగులు తరచూ మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఆరు ఏనుగులు వివిధ రకాల కారణాలతో చనిపోయాయి. ముఖ్యంగా వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగలతోనే చాలా వరకు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని దాహం తీర్చుకునేందుకు వచ్చి లోయల్లో పడి చనిపోయాయి.
     
    మూడు రాష్ట్రాల కారిడార్ ఎప్పుడో..


    ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్ నిర్మాణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని బన్నేరుగట్ట, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి కౌండిన్యలోకి తరచూ ఏనుగులు రావడంతోనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. శాశ్వత పరిష్కారంలో భాగంగా మూడు రాష్ట్రాల్లోని అడవిలో ఓ కారిడార్‌ను నిర్మించేందుకు స్థానిక అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొజెక్ట్‌కు నివేదిక పంపినా పనులు ముందుకు సాగలేదు. ఏనుగుల సంరక్షణ కోసం అడవుల్లో నీటి కుంటలు, షెల్టర్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు కందకాలు (ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్) చేపడితేగానీ సమస్య పరిష్కారమయ్యేలా లేదు.
     
    పదేళ్లుగా బాధపడుతున్నాం..
    నా పొలం అడవికి ఆనుకొని ఉంది. పదేళ్లుగా ఏనుగుల కారణంగా పంట నష్టపోతూనే ఉన్నా. సోలార్ ఫెన్సింగ్ అలంకారంగా ఉంది. ఇక గవర్నమెంట్ నుంచి సాయం ఎప్పుడొస్తుందో తెలీదు.
     -మురుగన్, రైతు, చెత్తపెంట,పలమనేరు మండలం
     
     ప్రభుత్వం స్పందించాలి..
     ఏనుగుల కారణంగా రైతులు పంటలను నష్టపోతూనే ఉన్నారు. అడవిని వదిలి ఏనుగులు బయటకు రాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇప్పటి వరకు రైతులకందాల్సిన నష్టపరిహారాన్ని పెంచి పంపిణీ చేయాలి.
     -ఉమాపతి నాయుడు, రైతు సంఘం నాయకులు
     
     త్రీ స్టేట్స్ కారిడార్‌తోనే పరిష్కారం
     ఈ సమస్య మూడు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ప్రత్యేక కారిడార్ నిర్మాణంతోనే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. ఇప్పటికే తమ ఉన్నతాధికారులు రెండు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించారు. త్వరలోనే  పనులు ప్రారంభం కావచ్చు.
    -బాలవీరయ్య, ఎఫ్‌ఆర్వో, పలమనేరు
     

మరిన్ని వార్తలు