నకిలీల దర్జా

21 Dec, 2013 03:38 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
 జిల్లాలో నకిలీ దందాలు దర్జా వెలగబెడుతున్నాయి. అసలు వ్యక్తులు మాత్రం వెలవెలబోతున్నారు. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగళ్లు జిల్లాలో విచ్చలవిడిగా చెలామణీలో ఉన్నట్లు ఇప్పటికే ‘సాక్షి’ పలుమార్లు అధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. వీటిపై ఒకపక్క అధికారుల విచారణ కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు నకిలీ దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంకులను బురిడీ కొట్టించి ఎటువంటి అర్హతలు లేనివారు సైతం లక్షలాది రూపాయల రుణాలు ఎగరేసుకుపోతుంటే.. సొంత భూమి ఉండి, ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అసలు రైతన్నలు మాత్రం రుణాలు, ఇతరత్రా రాయితీలు అందుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. ఈ వ్యవహారంలో దళారులతోపాటు రెవెన్యూ, బ్యాంకుల సిబ్బంది కూడా కీలక పాత్రధారులేననడం అతిశయోక్తి కాదు. జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లు వేల సంఖ్యలోనే ఉండగా, మొదటిసారి రెండేళ్ల క్రితం అధికారులు గుర్తించారు. అప్పట్లో ‘సాక్షి’ దీన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోందే తప్ప నకిలీ పుస్తకాల తయారుదారులనే గుర్తించలేకపోయా రు. పైగా నకిలీ పాస్ పుస్తకాలు ఉన్నందున లావేరు మండలంలోని పాస్‌పుస్తకాలన్నీ రద్దుచేసి  రైతులకు కొత్తవి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇది కూడా రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది.
 
 ఎక్కడపడితే అక్కడ
 రైతులు కాని రైతులు నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకులను బహిరంగ దోపిడీ చేస్తున్నారు. లక్షల్లో రుణాలు తీసుకుంటున్నారు. ఇటువంటివారు వాటిని తిరిగి చెల్లిస్తున్న దాఖలాలు కూడా తక్కువే. పైగా రుణమాఫీ సమయంలో వీరి రుణాలు రద్దయ్యాయి. తిరిగి వీరే మళ్లీ కొత్త రుణాలు తీసుకుంటున్నారు.
 
   ఆమదాలవలస మండలం కట్యాచార్యులపేటకు చెందిన సనపల చలపతిరావు గత ఏడాది బ్యాంకులను మోసం చేసి నకిలీ పాస్‌పుస్తకాలతో రుణం పొందాడు. ఈ ఏడాది కూడా రుణం పొందేందుకు ఆంధ్రా బ్యాంకులో దరఖాస్తు చేయగా అధికారులు క్షేత్ర పరిశీలన చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితమే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
 
   ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ నకిలీ పాస్ పుస్తకాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని లావేరు మండలంలోనే ఇవి మొదటిసారి వెలుగుచూశాయి. ఈ మండలంలోని పోతయ్యవలస గ్రామంలో సుమారు వంద నకిలీ పాస్‌పుస్తకాలు ఉన్నాయి. గతంలో ఈ గ్రామం నుంచి నకిలీ పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకున్న వారు రుణమాఫీ సౌకర్యాన్ని కూడా పొందారు. ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన రైతుల జాబితాల్లోనూ చేరి బీమా సొమ్ము సైతం అందుకున్నారు. ఇదే మండలం బుడమూరు గ్రామ పాలసేకరణ కేంద్రం వద్ద ఒక వ్యక్తి 30 మందికి ఫొటోలు తీసి నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి అదపాక ఆంధ్రా బ్యాంకులో రుణాలు పొందాడు. ఇంతవరకు ఇతనిపై చర్యలు లేవు. ఆ తరువాత జి. సిగడాం, రణస్థలం మండలాల్లోనూ గుర్తించారు.
 
   శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార మండలంలో నకిలీలు బయటపడిన ఉదంతాలు ఉన్నాయి.
   మరోవైపు మీసేవలో నకిలీ అడంగళ్ కాపీలు రావడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. బూర్జ మండలంలోని కొల్లివలస గ్రామంలో మొదట అధికారులు గుర్తించారు. ఆ తరువాత రాజాంలో వెలుగు చూశాయి. ఇటీవల ఆమదాల వలసలోనూ మీసేవలో నకిలీ అడంగళ్ కాపీలు బయటకు వచ్చాయి. అంటే నకిలీపాస్ పుస్తకాలతో పాటు నకిలీ అడంగళ్ కాపీలు కూడా విచ్చలవిడిగా తయారువుతున్నాయి.
 
 పాస్ పుస్తకాల రద్దుతో అసలు రైతుల అవస్థలు
 లావేరు మండలంలో నకిలీ పాస్‌పుస్తకాలు ఉన్నాయనే ఫిర్యాదులు రావడంతో మండలంలోని రైతులందరి పాస్ పుస్తకాలు చెల్లవని ప్రకటించి రద్దు చేశారు. సరైన డాక్యుమెంట్లతో పాస్ పుస్తకాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అయితే తాత తండ్రుల నుంచి వారసత్వంగా తమకు రిజిస్టర్డ్ భూములు ఉన్నాయని, వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతులు కోరడంతో అప్పట్లో అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల ఆవేదన విన్న తరువాత కొత్త పాస్‌పుస్తకాల కోసం 6ఎ క్లెయిమ్ దాఖలు చేయాలని రైతులను కోరారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పాస్‌పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియ మూడు నెలలపాటు కొనసాగింది. అయినా అర్హులైన వారందరికీ పాస్‌పుస్తకాలు ఇవ్వలేకపోయారు.
 
 అప్పటి జేసీ చొరవతో టాస్క్‌ఫోర్స్
 అర్హులైన రైతులను గుర్తించి కొత్త పుస్తకాలు ఇచ్చేందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్ ఆరు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. వారిచ్చిన నివేదికల ఆధారంగా ఇప్పటి వరకు 450 మందికి పుస్తకాలు ఇచ్చారు. ఇంకా 350 మందికి ఇవ్వాల్సి ఉంది. అయితే జిరాయితీ భూములున్న రైతుల వద్ద ఆధారాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి రైతులకు అనుభవదారు సర్టిఫికెట్ మాత్రమే ఇస్తున్నామని వారు చెబుతున్నారు.
 
 అసలు రికార్డులు గల్లంతు
 ఈ మండలంలో పూర్వపు రికార్డులు గల్లంతు కావడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అనేక మంది రైతుల వద్ద సరైన డాక్యుమెంట్లు లేవు. రెవెన్యూ శాఖ వద్ద రికార్డులు లేవు. ఇదే రైతులకు శాపంగా మారింది. సమగ్ర సర్వే చేసి గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారం కొత్త రికార్డులు తయారు చేయాల్సిన అవసరం ఉంది.
 ఇంటి దొంగల వేటలో అధికారులు
 
 రెవెన్యూ శాఖకు తెలియకుండా పాస్‌పుస్తకాలు బయటకు వెళ్లే అవకాశం లేదు. ఈ కోణంలోనే ఆ శాఖ విచారణ కొనసాగిస్తోంది.   పాస్‌పుస్తకాలు అసలు ఈ జిల్లాకు సంబంధించినవా, వేరే జిల్లాల నుంచి తెచ్చుకున్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. ప్రధానంగా వీఆర్‌వోల వద్ద నుంచే పాస్‌పుస్తకాలు వెళుతున్నాయనే అనుమానం ఉంది. పాస్ పుస్తకాలు ఎలా బయటకు వెళుతున్నాయనేది తేలితే దొంగ సంతకాలు ఎవరు చేస్తున్నారనేది కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే సరైన కోణంలో దర్యాప్తు సాగడం లేదనే విమర్శలున్నాయి.  
 
 విచారణ జరుగుతోంది: ఆర్డీవో గణేష్‌కుమార్
 నకిలీ పాస్‌పుస్తకాలు, నకిలీ అడంగల్ కాపీల విషయమై విచారణ జరుగుతోందని శ్రీకాకుళం ఆర్డీవో జి గణేష్‌కుమార్ తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. లావేరు మండలంలో పాస్‌పుస్తకాలు తీసుకోవాల్సిన వారు సరైన భూమి హక్కు పత్రాలు చూపించి పొందవచ్చని చెప్పారు. అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు