ఖర్చుల వివరాలు అందించకుంటే నోటీసులు

19 Jun, 2014 02:30 IST|Sakshi
ఖర్చుల వివరాలు అందించకుంటే నోటీసులు

ఒంగోలు కలెక్టరేట్ : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు నిర్ణీత కాలవ్యవధిలో ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించకుంటే నోటీసులు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్(వ్యయం) పీకే దాస్ ఆదేశించారు. ఎన్నికల వ్యయంపై న్యూఢిల్లీలోని నిర్వచన్ భవన్ నుంచి బుధవారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు అందించని అభ్యర్థులపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పెయిడ్ న్యూస్ ఖర్చులను కూడా ఎన్నికల ఖర్చులో చూపించాలన్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఖర్చుల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
 
నోటీసులు జారీ చేశాం : కలెక్టర్ విజయకుమార్
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల వ్యయ వివరాలు అందించని అభ్యర్థులకు నోటీసులు జారీ చేసినట్లు పీకే దాస్‌కు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 187 మంది అభ్యర్థులు పోటీచేయగా 181 మంది అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలు అందించారన్నారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు 29 మంది అభ్యర్థులు పోటీచేయగా, 25 మంది అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలు అందించినట్లు చెప్పారు.
 
ఎన్నికల వ్యయ వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అజయ్‌కుమార్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజన్, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు మోహిత్‌విశ్వ, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు రోహిత్‌రాజ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు