జీఎంసీ ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు

18 Dec, 2014 03:21 IST|Sakshi

ఇన్‌చార్జి కమిషనర్ శ్రీధర్
 అరండల్‌పేట: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కమిషనర్ సీహెచ్.శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. తొలుత నగరానికి మంచినీటిని సరఫరా చేసే తక్కెళ్లపాడు వాటర్‌ప్లాంటును తనిఖీచేశారు. అక్కడ నీటిలో క్లోరిన్‌శాతాన్ని పరిశీలించారు. అనంతరం ప్లాంటులోని బెడ్లను పరిశీలించి మొత్తం ఆరు బెడ్లు శిధిలావస్థకు చేరడాన్ని గమనించి వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు.
 
  ప్లాంటు విస్తరించి ఉన్న 40 ఎకరాలకు రక్షణగోడను నిర్మించాలని, ప్లాంటుకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇక్కడ ఎకరం స్థలంలో సొంతంగా నర్సరీని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నగరంలోని సెంటర్ డివైడర్లు, ఐలాండ్‌లు, జంక్షన్ల వద్ద గోడలపై విపరీతంగా పోస్టర్లు అతికించి ఉండటం గమనించి వాటిని వెంటనే తొలగించాలన్నా రు.
 
 తిరిగి అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నా రు. ఐలాండ్లు, సెంట్రల్ డివైడర్లలో మొక్కలు పెంచాలనని చెప్పారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు, బ్యానర్లను తొలగించాలన్నారు. గుజ్జనగుండ్ల వాకింగ్‌ట్రాక్‌ను పరిశీలించి అక్కడ జిమ్, యోగా సెంటర్, లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, చెరువుకు నీరు పెట్టేందుకు వంకాయలపాడు కాలువ నుంచి నిర్మిస్తున్న పైపులైన్ పనులు పూర్తిచేయాలన్నారు.
 
 గుజ్జనగుండ్ల నుంచి పెదపలకలూరు వెళ్లే రహదారిని నిర్మించేందుకు అంచనాలు సిద్దంచేయాలన్నారు.  ఈ పర్యటనలో ఎస్‌ఈ డి మరియన్న, ఈఈలు రాంనాయక్, వెంకటేశ్వర్లు, ఏసిపి రవీందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు