'జీవో నెంబర్ ఎంఎస్ 8ని వెంటనే రద్దుచేయాలి'

28 Feb, 2015 16:26 IST|Sakshi

మాచర్లటౌన్(గుంటూరు): రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో కండక్టర్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా జారీ చేసిన జీవో ఎంఎస్.8ని వెంటనే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి కె.వి నరసింహారావులు అన్నారు. శనివారం స్థానిక బస్టాండ్ ప్రాంగణం ఎదురుగా భారీ స్థాయిలో మజ్దూర్ యూనియన్ నాయకులు సామూహిక దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడారు. కండక్టర్ వ్యవస్థను రద్దు చేసేందుకే ట్రిమ్ మిషన్లు ప్రవేశపెట్టి డ్రైవర్లపై భారం మోపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతచర్యలు అమలు చేయాలని, బస్సులను కొనుగోలు చేయాలని, విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆర్టీసీలో 58-42 నిష్పత్తిలో ఆర్టీసీకి చెందిన ఆస్తులు కేటాయించాలని, ట్రిమ్ మిషన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... గుర్తింపు పొందిన ఎంప్లాయిస్ యూనియన్... కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించేది ఎన్‌ఎంయూ మాత్రమేనన్నారు. అనంతరం డిపోకు చెందిన 200 మంది ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఎన్‌ఎంయూలో చేరినట్లు జిల్లా నాయకులు ప్రకటించారు. అందరూ సమిష్టిగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘ నాయకులు దీక్షల్లో పాల్గొని మాట్లాడారు.

మరిన్ని వార్తలు