Sakshi News home page

ధోనీసేన డబుల్ హ్యాట్రిక్ కొట్టేనా?

Published Sat, Feb 28 2015 4:34 PM

Team india can do hatrick?

ప్రపంచ కప్ ఆరంభానికి ముందు టీమిండియాపై పెద్దగా అంచనాల్లేవు. భారత్ డిఫెండింగ్ చాంపియనే అయినా ఈ మెగా ఈవెంట్కు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలం కావడమే కారణం. అయితే ప్రపంచ కప్లో భారత్ ఒక్కసారిగా పుంజుకుంది. బ్యాటింగ్లో బలంగా ఉన్న ధోనీసేన బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ ఎంతో మెరుగుపడింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాలు సాధిస్తోంది. ధోనీసేన హ్యాట్రిక్ విజయంతో దాదాపుగా నాకౌట్ బెర్తు సాధించింది. గ్రూపు-బి టాపర్గా ఉన్న టీమిండియా లీగ్ దశలో ఇంకా మూడు   మ్యాచ్లు ఆడనుంది. పసికూనలు ఐర్లాండ్, జింబాబ్వేతో పాటు వెస్టిండీస్తో ఆడాల్సివుంది. భారత్ ఇదే జోరు కొనసాగించి డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా? ఓటమే లేకుండా నాకౌట్కు చేరుతుందా? అన్నది ఆసక్తికరమైన అంశం.

పూల్-బిలో ఉన్న ధోనీసేన తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘనవిజయం సాధించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. ఆ తర్వాత పటిష్టమైన  దక్షిణాఫ్రికాపై అంచనాలకు మించి రాణించింది. సఫారీలను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ భారీ విజయాలు నమోదు చేయడం విశేషం. మనోళ్లు మ్యాచ్లను ఏకపక్షంగా మార్చేశారు. ఇక పసికూనలు యూఏఈపై అయితే తిరుగేలేదు.

ప్రస్తుతం టీమిండియా జోరు చూస్తుంటే.. వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వేలపై నెగ్గడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. విండీస్ ఆటతీరు అనిశ్చితిగా ఉంది. జింబాబ్వేపై రికార్డుల మోత మోగించిన విండీస్.. ఆ వెంటనే సఫారీల చేతిలో ఘోరపరాభవం మూటగట్టుకుంది. ఇక పసికూనలు జింబాబ్వే, ఐర్లాండ్ ఆశించిన స్థాయిలో రాణిస్తున్నా.. టీమిండియా కాస్త జాగ్రత్తగా ఆడితే వీటితో పెద్దగా సవాల్ ఎదురుకాకపోవచ్చు.
 

Advertisement

What’s your opinion

Advertisement