వరద మిగిల్చిన వ్యధ

13 Aug, 2019 08:05 IST|Sakshi

పది రోజుల కిందట వరుణుడు తోడుగా ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ నీటిజడి పెరుగుతూ.. తగ్గుతూ ఏజెన్సీ, కోనసీమ లంక వాసులను భయాందోళనకు గురిచేసింది. సోమవారం నాటికి వరద ముంపు వీడడంతో ఏజెన్సీ గ్రామాలు...కోనసీమ లంకలవాసులు ఊపిరి పీల్చుకున్నా పేరుకుపోయిన బురదతో బెంబేలెత్తుతున్నారు. ఏజెన్సీలో రహదారుల మీద... కోనసీమ లంకల్లో కాజ్‌వేలపైన ముంపు వీడడంతో రాకపోకలు ఆరంభమై సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గినా అది తీసుకువచ్చిన బురద ప్రభుత్వ యంత్రాంగానికి, స్థానికులకు పెద్ద సవాలుగా మారింది. పారిశుద్ధ్య చర్యలు పెద్ద ఎత్తున చేపట్టకపోతే అంటు రోగాల బారిన పడే ప్రమాదముందని వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. విలీనమండలాలు వి.ఆర్‌.పురం, కూనవరం, ఎటపాకతోపాటు దేవీపట్నం మండలాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా 36 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న దేవీపట్నం మండలం నెమ్మదినెమ్మదిగా తేరుకుంటోంది. ఈ మండలంలో వరద పూర్తిగా తగ్గింది. మండల కేంద్రమైన దేవీపట్నం, పూడిపల్లి వెళ్లేందుకు మార్గాలు ఏర్పడలేదు. ఎగువున మంటూరు, పెంకులుపాడు, మూలపాడు వంటి గ్రామాలకు రాకపోకలు ఆరంభం కాలేదు. గోదావరి వరదతోపాటు కొట్టుకువచ్చిన వ్యర్ధాలు బురదకు తోడవడంతో స్థానికులు తలపట్టుకుంటున్నారు.

దేవీపట్నంలో శివాలయం, ఉన్నత పాఠశాల, వీరవరంలో తహసీల్దార్‌ కార్యాలయం, రంపచోడవరం గొర్నగూడెం హాస్టల్‌ వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల గ్రామాలకు ఆహారం సరఫరా చేస్తున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వెళ్లి చాలా మంది పరిసరాలను శుభ్రం చేసేపనిలో పడ్డారు. వీరితోపాటు అధికార యంత్రాంగం కూడా పారిశుద్ధ్య చర్యల్లో తనమునకలైంది. పోచమ్మగండి గ్రామం ముంపు నుంచి బయటపడింది. వీఆర్‌.పురం, చింతూరు, కూనవరం మండలాల్లో వరదల వల్ల 28 గ్రామాలు వరద నీటిలో చిక్కుకోగా ఇప్పుడు రోడ్లన్నీ ముంపు నుంచి బయటపడ్డాయి. కానీ తోకిలేరువాగు నుంచి వచ్చిన బురద రోడ్డుపై పేరుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలు కాలేదు.

కోనసీమలో ఊరట
కోనసీమలంకలు కూడా ముంపుబారి నుంచి బయటపడుతున్నాయి. ముక్తేశ్వరం వద్ద ఎదురుబిడియం కాజ్‌వే, మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేలు వరద ముంపు నుంచి బయట పడ్డాయి. దీంతో ఈ కాజ్‌వేలపై వాహనాల రాకపోకలు ఆరంభమయ్యాయి. ఈ నెల నాల్గో తేదీ నుంచి ఈ కాజ్‌వేలపై వరద నీరు చేరడంతో ఎక్కువ రోజులు పడవల మీదనే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. పి.గన్నవరం మండలం కనకాయిలంక కాజ్‌వేపై ఇంకా రెండు అడుగులు ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ఈ మండలంలో మానేపల్లి శివారు శివాయలంక ఇంకా ముంపులోనే ఉంది. అల్లవరం మండలం బోడసుకుర్రు నదీ తీరంలో వరద పూర్తిగా తగ్గింది.

నదిని ఆనుకుని ఉన్న స్థానిక మత్స్యకార కాలనీతోపాటు పలు ఇళ్లు ముంపునుంచి బయటపడ్డాయి. ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక వంటి గ్రామాలు వరద నుంచి బయటపడ్డాయి. గోదావరి మధ్య ఉండే సలాదివారిపాలెం, కమిని వంటి గ్రామాలకు, అలాగే పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, ఉడుమూడిలంక, అరిగెలవారిలంక, బూరుగలంక గ్రామాలు గోదావరి మధ్యనే ఉంటాయి. ఇక్కడ వరద తగ్గడంతో సాధారణ పడవల మీద రాకపోకలు సాగిస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు