సాహితీ శిఖరం.. కళల కెరటం..

13 Dec, 2019 08:57 IST|Sakshi

పెదవాల్తేరు/మద్దిలపాలెం(విశాఖతూర్పు): అవధుల్లేని మహా ప్రవాహం ఆయన జీవన పయనం. అనంతమైన మహా సముద్రం ఆయన అనుభవ సారం. అనేక అధ్యాయాల.. అసంఖ్యాక ప్రకరణాల ఉద్గ్రంథం ఆయన ప్రతిభాసామర్థ్యం. సామాన్య కుటుంబాన జన్మించి.. అక్షర సేద్యంలో రాణించి.. ఆపై అనేక రంగాల్లో అసమాన నైపుణ్యం చూపించి.. తుదిశ్వాస వరకు సృజనాత్మకతనే శ్వాసించి.. తెలుగు సాహితీ కళారంగాల్లో అనితర సాధ్యమైన స్థానం సంపాదించి దూరతీరాలకు తరలిపోయిన గొల్లపూడి మారుతీరావు అచ్చంగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. చిన్ననాట ఇక్కడ ఓనమాలు దిద్దినా.. తర్వాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నీడలో విద్యాభ్యాసం చేస్తూనే రంగస్థలంపై సృజన కిరణాలు ప్రసరింపజేసినా.. నాటక రంగంలో మహనీయులతో కలసి నైపుణ్యానికి సానపెట్టుకుని తళుకులీనినా.. తర్వాత జీవన సంధ్యాకాలంలో విశాఖను శాశ్వత నివాసంగా చేసుకున్నా.. ఆయన జీవితంలో వైశాఖి కీలకపాత్ర పోషించింది.

ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడే హాయిగా ఉంటుందన్న భావన కలిగించింది. విశాఖ నుంచి అనివార్యంగా తరలివెళ్లిన తర్వాత చెన్నపట్నంలో ఆయన తుదిశ్వాస వీడినా.. ఆయన దివ్యాత్మ విశాఖ ఒడిలోకే చేరి ఉంటుంది. విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావు కుటుంబసభ్యులతో విశాఖలో దాదాపుగా 15 సంవత్సరాలపాటు నివసించారు. ఆయన పిఠాపురం కాలనీ జనశిక్షణ సంస్థాన్‌ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లోనివసించారు. ఏడాది క్రితమే ఈ ఫ్లాట్‌ విక్రయించేసి చెన్నై వెళ్లిపోయారు.

ఏయూలో పాఠ్యపుస్తకం
గొల్లపూడి రచనలను భారతదేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా ప్రాచుర్యంలో వున్నాయి. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాలను ఆంధ్రాయూనివర్శిటీ లో గల థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగంలో పాఠ్యపుస్తకంగా వుంది. గొల్లపూడి రచనలపై ఎంతోమంది విద్యార్థులు పరిశోధనలు చేసి ఎంఫిల్, డాక్టరేట్లు పొందారు. ప్రముఖ సినిమా నటుడు వంకాయల సత్యనారాయణ కుమార్తె లావణ్య గొల్లపూడి రచనలపై పరిశోధనలు చేసి ఏయూ నుంచి డాక్టరేట్‌ పొందారు.

మానసిక పాఠశాలలో...
పెదవాల్తేరులో గల హిడెన్‌స్ప్రౌట్స్‌ పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొనేవారని పాఠశాల వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. తరచూ పాఠశాల నిర్వాహకులతో సమావేశమయి మానసిక దివ్యాంగుల యోగక్షేమాలు విచారించేవారు.  ఎన్నో స్మృతులు ఆయన విశాఖలో జరిగిన పలుసాంస్కృతిక కార్యక్రమాలలో విశిష్ట అతిథిగా పాల్గొనేవారు. పిఠాపురం కాలనీ కళాభారతి, ప్రేమసమాజం తదితర వేదికలపై జరిగిన సినిమా సంగీత విభావరి, ఇతర కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన వన్‌టౌన్‌లోని కురుపాం మార్కెట్‌ , టౌన్‌హాలు, హిందూ రీడింగ్‌రూమ్‌ లతో గొల్లపూడికి ఎంతో అనుబంధం వుంది. నాటకరంగంలో వున్నపుడు ఆయన ఇక్కడ  సహచరులతో సంతోషంగా గడిపేవారని, నగర వీధుల్లో తిరిగేవారని రచయిత, వ్యాఖ్యాత భీశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. 

ఓనమాలు ఇక్కడే..
ఆయన సీబీఎం పాఠశాలలోను, ఏవిఎన్‌ కళాశాలలోను, ఆంధ్రాయూనివరి్సటీలోను విద్యాభ్యాసం చేశారు. గొల్లపూడి విద్యార్థి దశలో వుండగానే శ్రీవాత్సవ రచించిన స్నానాలగది నాటకానికి కెవి గోపాలస్వామి దర్శకత్వం వహించారు. ఈ నాటకంతోపాటుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోను నటించారు. కాగా, మనస్తత్వాలు నాటకాన్ని కొత్తఢిల్లీలో జరిగిన ఐదో అంతర్‌ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలలో భాగంగా ప్రదర్శించడం విశేషం. గొల్లపూడి రచన అనంతం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డు పొందింది. చైనా ఆక్రమణపై తెలుగులో మొదటి నాటకం రచించి చిత్తూరు, మదనపల్లి , నగరి ప్రాంతాలలో ప్రదర్శించి వచ్చిన రూ.50వేల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు.

అమ్మ చెప్పిన పురాణాలే తొలి పాఠాలు
మారుతీరావు పూర్తి పేరు వెంకట సూర్య మారుతి లక్ష్మీ నారాయణ. అమ్మ అన్నపూర్ణమ్మ చదవే పూరాణాలు వింటూ, వాటి సారాన్ని ఔపోసన పడుతూ.. ఆపై కొత్త ఆలోచనలు పేర్చుకుంటూ పెరిగారు.  విన్న పురణాల గాథలను నాన్న సుబ్బారావుగారి షార్ట్‌హేండ్‌ పుస్తకాలపై రాసేవారు. ఇలా భాషపై పట్టుసాధించారు. తాను చూసిన తాజ్‌మహల్‌ వంటి అద్భుత కట్టడాల గురించి అనుభూతులను ఆవిష్కరించారు. యవ్వనంలోకి అడుగుపెట్టక ముందే “రేనాడు ‘అనే వీక్లీలో ఆయన తొలి నవల ‘ఆశాజీవి’ అచ్చయింది. మహాకవి శ్రీశ్రీ కొన్నాళ్లు కంపోజింగ్‌ సెక్షన్‌లో పనిచేయడంతో కొత్త రచయితలకు అలాంటి స్థానిక పత్రికపై మక్కువ ఉండేదని.. తమ రచనలు వాటిలో ముద్రితమైతే చూడాలనే ఆరాటం ఉండేదని తర్వాత ఆయన చెప్పేవారు.  

పర్యావరణ ప్రేమికుడు..
సీతంపేట: గొల్లపూడి మారుతీరావు సినీనటుడు, జర్నలిస్టు మాత్రమే కాదు పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణ మార్గదర్శి నిర్వహించిన పలు కార్యక్రమాల్లో  ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ పరిస్థితులను గురించి అవలీలగా మాట్లాడేవారు. పర్యావరణ మార్గదర్శి సభ్యులతో ఎప్పుడు కలిసినా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణతాపం పెరిగిపోతోందని.. మంచు కొండలు కరిగిపోతున్నాయని, వాయుకాలుష్యం పెరుగుతోందని చెప్పారు. ఆహార పదార్థాల్లో విషతుల్య రసాయనాలు చేరుతున్నాయని వివరించేవారు. ఆయన మృతి పర్యావరణ మార్గదర్శి సభ్యులకు దిగ్భ్రాంతి కలిగించింది. 
– ఎస్‌.విజయ్‌కుమార్, అధ్యక్షుడు, పర్యావరణ మార్గదర్శి వైశాఖి 

నడిచే విజ్ఞాన సర్వస్వం
గొల్లపూడి నడిచే విజ్ఞాన సర్వస్వం. బహుముఖ ప్రజ్ఞానిధి.  రచన,  పత్రిక, నాటకం, సినిమా ఈ నాలుగు రంగాలలో ఆంధ్ర రాష్ట్రంలో సాధికారికంగా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి గొల్లపూడి. సినిమా రంగంలో ఆయన ప్రతిభ అందరికీ తెలిసిందే, సాహిత్య రంగంలో ఏ విషయం మీద అయినా చాలా వేగంగా అద్భుతంగా రచనలు చేయగలిగే నిష్ణాతుడు. వందేళ్ల కధకు వందనాలని టీవీలో ప్రోగ్రామ్‌ చేశారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ నుంచి ఇప్పటి మా తరం వరకు మాబోటి వారితో.. మొత్తం మీద  నాలుగు తరాల వారితో గొల్లపూడికి అనుబంధం ఉంది. 
– డి.వి.సూర్యారావు, రచయిత

గొల్లపూడికి గీతం డాక్టరేట్‌
ఆరిలోవ(విశాఖతూర్పు): సినీ నటుడు గొల్లపూడి మారుతిరావుకు గీతం వర్సిటీతో మెరుగైన సంబంధాలు ఉండేవి. ఆయన నటన శైలి, రచనలను గీతం డీమ్డ్‌ వర్సిటీ గుర్తించింది. ఇందులో భాగంగా 2017లో గీతం 8వ స్నాతకోత్సవం సందర్భంగా డాక్టరేట్‌ ప్రకటించింది. అప్పటి స్నాతకోత్సవంలో గీతం చాన్సలర్‌ కోనేరు రామకృష్ణారావు గొల్లపూడి మారుతీరావుకు డాక్టరేట్‌ను అందజేసి గౌరవించారు.

నవ్వుతూ, నవ్విస్తూ ఉండే స్నేహశీలి
మహారాణిపేట(విశాఖ దక్షిణం): తెలుగు సాహిత్యంలో సాటిలేని సంతకం గొల్లపూడి మారుతీరావుది. నాటక, సినీ రంగాల్లో ఆయనది అందె వేసిన చెయ్యి. ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, వర్తమాన అంశాలను స్పృశిస్తూ వాస్తవాలను ఎలుగెత్తి చెప్పేవి. వివిధ పత్రికల్లో ప్రచురితమైన రచనలు పాఠకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటన్నిటికీ మించి మంచి స్నేహశీలి. ఎప్పడు తన మాటలతో ఎదుటివాడి నోటికి తాళం వేసేటట్టు.. ఛలోక్తులు విసురుతూ మాటాడేవారు. మాటకారితనంతో మురిపించేవారు. అందరిని నవ్విసూ్త,నవ్వుతూ ఉండేవారు. ఆయన మృతి సాహితీరంగానికి తీరని లోటు. నేను మంచి మిత్రుడిని కోల్పోయాను. 
-వంగపండు ప్రసాదరావు, కళాకారుడు
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు