‘నిజాం షుగర్స్’ ప్రభుత్వ పరం

18 Jan, 2014 05:45 IST|Sakshi

బోధన్ టౌన్/బోధన్, న్యూస్‌లైన్: బోధన్ శక్కర్‌నగర్‌లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 12 ఏళ్లుగా పోరాడుతున్నామని, కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో మా పోరాటం ఫలించినట్లైందని ఏపీ షుగర్స్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి రాజయ్య హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని చక్కెర కర్మాగారం వద్ద యూనియన్ నాయకులు, శక్కర్‌నగర్ కాలనీలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం టేకోవర్ చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇది కార్మికుల విజయమన్నారు.
 
 శాసనసభా సంఘం నివేదికను అమలు చేయాలని అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ పోరాడారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మురళి, శివరామ్, బాలకృష్ణ, సూరజ్ ప్రసాద్, మల్లేశం, రమేశ్, భిక్షపతి, ప్రసాద్‌రావ్, కార్మికులు నీలమ్మ, గోపి, లక్ష్మి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రామరాజు, ఉపాధ్యక్షులు మేకల రవి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఫ్యాక్టరీ నేపథ్యం
 బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో 1932లో నిజాం ప్రభువులు చక్కెర కర్మాగార నిర్మాణాన్ని ప్రారంభించారు. 1938లో నిర్మాణం పూర్తైది. ఫ్యాక్టరీ అభివృద్ధికి 16 వేల ఎకరాలను కేటాయించారు. చెరుకు సాగుకు రైతులను ప్రోత్సహించారు. తర్వాతి కాలంలో సుమారు 40 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి పొందారు. అప్పట్లో ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ఈ ఫ్యాక్టరీ గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్లు లాభాల బాటలో నడిచింది.
 
 బాబు జమానాలో..
 2002లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించారు. నష్టాలను సాకుగా చూపి ఫ్యాక్టరీ ఆస్తులను తెగనమ్మారు. బోధన్ యూనిట్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి, మెదక్ జిల్లాలోని ముంబోజీపేట్ చక్కెర కర్మాగారాలను ప్రైవేటీకరించారు. సుమారు రూ. 350 కోట్ల విలువైన ఫ్యాక్టరీ ఆస్తులను రూ. 67 కోట్లకే డేల్టా కంపెనీకి కట్టబెట్టారు. ప్రైవేట్ సంస్థకు 51 శాతం, ప్రభుత్వం 49 శాతం వాటాతో జాయింట్ వెంచర్ చేశారు. దీంతో రైతులు, కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యం లాభాపేక్షతో వ్యవహరించడంతో రైతులు, కార్మికులు నష్టపోయారు. వీఆర్‌ఎస్ పేరుతో కార్మికులను తొలగించింది. ఫలితంగా వందలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. బోధన్‌లోనే 75 మందికిపైగా కార్మికుల బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 
 రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక..
 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై శాసనసభా సంఘాన్ని నియమించారు. విచారణ జరిపిన శాసనసభా సంఘం.. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని తేల్చింది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2006లో సిఫారసు చేసింది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ 2007లో బోధన్‌కు చెందిన నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీఎంఎస్ కార్యదర్శి రాజయ్య హైకోర్టును ఆశ్రయించారు.
 
 రోశయ్య హయాంలో..
 ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోవడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని 2010 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను ఆదేశించారు. 2011 నవంబర్ 11న జిల్లాకు వచ్చిన అప్పటి ప్రభుత్వ రంగ సంస్థల మంత్రి శంకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే జీవోపై సంతకం చేశానని ప్రకటించడంతో ఈ ప్రాంత రైతులు, కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది. తర్వాత మళ్లీ కథ మొదటికి వచ్చింది.
 
 విజయమ్మ పిటిషన్
 చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ 2011 అక్టోబర్‌లో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో నిజాంషుగర్స్ ప్రైవేటీకరణ అంశాన్నీ చేర్చారు.
 
 కిరణ్‌కుమార్‌రెడ్డి
 నిజాంషుగర్స్ జాయింట్ వెంచర్‌లో ప్రభుత్వ వాటాను పూర్తిగా తొలగించి ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రపన్నారన్న ఆరోపణలున్నాయి. 2013 డిసెంబర్ 13న తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఏడుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించారు. నిజాంషుగర్స్‌ను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీని నియమించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కుట్రను అడ్డుకునేందుకు చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
 
 సర్కారు కుట్రలకు హైకోర్టు బ్రేక్
 సబ్ కమిటీపై విశ్వాసం లేకపోవడంతో నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన సబ్ కమిటీని రద్దు చేసి రైతాంగం, కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ నెల 9న సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చిందని అప్పిరెడ్డి పేర్కొన్నారు. కోర్టు అనుమతి లేకుండా సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు.
 
 సానుకూల నిర్ణయం
 శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రి వర్గ ఉప సంఘం ఫ్యాక్టరీ విషయంలో నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సబ్ కమిటీ నిర్ణయంపై రైతులు, కార్మికులు, తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు