నిరుద్యోగులకు శుభవార్త

6 Aug, 2013 05:40 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, వరంగల్: నిరుద్యోగులకు ఉపాధి బాట చూపేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యంగా ఎంచుకుంది. దాదాపు 20వేల మందికి ఉపాధి కల్పించే ధ్యేయంతో అడుగు ముందుకేస్తోంది. కలెక్టర్ జి.కిషన్ స్వీయ ఆలోచనతో ఈ కొత్త ప్రాజెక్టు పురుడు పోసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ కిరణాలు, వృత్తి విద్య, ఉపాధి కోర్సులన్నింటినీ ఇందులో భాగంగా ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తారు. సమీకృత ప్రణాళికను సిద్ధం చేసి డీఆర్‌డీఏ సారథ్యంలో ‘ఉపాధి బాట’ చేపట్టాలని భావిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం కంకణం కట్టుకుంది. ఇప్పటికే ముందస్తు కసరత్తు చేపట్టింది. ప్రతి వంద మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో అయిదుగురికే ప్రతిష్టాత్మక సంస్థలలో ఉపాధి దొరుకుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ప్రతి 1000 మంది డిగ్రీ గ్రాడ్యుయేట్లలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరి మిగతా వారికేమైనా ఉపాధి మార్గాలున్నాయా...? ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలేమన్నా ఉన్నాయా...? అనే కోణంలో కలెక్టర్ తన ఆలోచనలకు కార్యరూపమిచ్చే కసరత్తు ప్రారంభించారు.
 
   గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిని, విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఇంగ్లిష్‌పై పట్టు లేకపోవడం.. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడంతో కార్పొరేట్, మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అందుకే నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ తరగతులు నిర్వహించి... వారిని ఉపాధి బాట పట్టించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ(నిట్) ప్రొఫెసర్లు, కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ డిగ్రీ కళాశాల, ఎల్‌బి కళాశాల, ఆర్ట్స్ సైన్స్ కళాశాలలతో పాటు జిల్లాలోని వివిధ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐల ప్రిన్సిపాళ్లతో ఇప్పటికే కలెక్టర్ సమావేశమయ్యారు. ముందుగా గ్రామీణ విద్యార్థులకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇప్పించేందుకు డీఆర్‌డీఏ సారథ్యంలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.
 
 శిక్షణ ఇలా..
 ముందుగా గ్రామాల్లో సర్వే చేసి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబిఎ, బి ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులను గుర్తిస్తారు. వీరిలో ఆసక్తి ఉన్న వారికి ఉపాధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వీరిని మూడు కేటగిరీలుగా విభజించి.. ఐఏఎస్, గ్రూపు-1 గ్రూపు-2 తదితర ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు వెళ్లే వారికి బీసీ, ఎస్సీ, గిరిజన స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తారు. ఇంటర్ పూర్తి చేసిన వారికి సర్వీస్ సెక్టారు కింద వృత్తి విద్య కోర్సులు నేర్పిస్తారు. ల్యాబ్ టెక్నీషియన్, ప్లంబింగ్, వైరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కంప్యూటర్లు, షాపింగ్‌మాల్స్, హాస్పిటల్ తదితర రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లతో పాటు నిర్మితి కేంద్రాలు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ తదితర సంస్థలన్నింటినీ ఇందులో భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఐటీడీఏ నిధులతో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్లంలపై శిక్షణ ఇప్పించనున్నారు. ప్రతి డిగ్రీ కాలేజీలో ఈ శిక్షణ ఇచ్చేందుకు రిసోర్సు పర్సన్లను నియమిస్తారు. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, ఆంగ్లంపై పట్టు సాధించేందుకు కనీసం మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణనిచ్చేలా ఈ ప్రోగ్రాం రూపొందిస్తారు. రిసోర్సు పర్సన్లకు ఎన్‌ఐటీ, కేయూ అధ్యాపకులతో ముందుగా శిక్షణను ఇప్పిస్తారు. ఈ శిక్షణను పంద్రాగష్టు నుంచే ప్రారంభించాలని యోచిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు