ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్‌

7 Mar, 2020 04:32 IST|Sakshi
జిల్లా ఎస్పీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

డబ్బు, మద్యం పంపిణీపై ఉక్కుపాదం మోపండి 

జిల్లా ఎస్పీలతో డీజీపీ సవాంగ్‌ 

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ ఏ క్షణంలోనైనా అమల్లోకి రావచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్‌లతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, అందుకు అనుగుణంగా అంతా పని చేయాలన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటు వద్దన్నారు. ఎన్నికలు ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా విషయంలోనూ సీరియస్‌గా ఉండాలని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.  

ట్వంటీ ట్వంటీ.. ఉమెన్‌ సేఫ్టీ 
ట్వంటీ ట్వంటీ.. ఉమెన్‌ సేఫ్టీ (2020 మహిళల భద్రతా సంవత్సరం)గా ప్రకటించినట్లు సవాంగ్‌ చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీజీపీ ఏమన్నారంటే..  
నిర్భయ చట్టం ఆశించిన ఫలితాలివ్వలేదు 
-  2012లో వచ్చిన నిర్భయ చట్టం 8 ఏళ్లలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. 
-  అందుకే దిశ–2019 చరిత్రాత్మక బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. 
-  మహిళా పోలీస్‌ స్టేషన్లను ఆధునికీకరించి ‘దిశ’ పోలీస్‌ స్టేషన్లుగా మారుస్తున్నాం.
- ఇప్పటికే ఆరు దిశ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభించాం. మరో 12 స్టేషన్లను మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న ప్రారంభిస్తాం. 

మహిళా దినోత్సవ వేడుకల్లో.. 
- పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం డీజీపీ ప్రారంభించారు. 
- మహిళల భద్రత కోసం దిశతో పాటు మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర తీసుకొచ్చామని తెలిపారు.

మరిన్ని వార్తలు