హవ్వ.. ఇదేం విచిత్రం!

6 Nov, 2013 00:05 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: క్షేత్రస్థాయి అధికారుల పోస్టుల భర్తీ పట్టించుకోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉన్నత స్థాయిలో కొత్త పోస్టుల సృష్టికి ఉబలాటపడుతోంది. జిల్లాస్థాయిలో ప్రస్తుతం ప్రజా సంబంధాల అధికారి(డీపీఆర్‌ఓ) పర్యవేక్షణలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. డీపీఆర్‌ఓ పోస్టును కొనసాగిస్తూనే కొత్తగా డిప్యూటీ డెరైక్టర్(డీడీ) లేదా అసిస్టెంట్ డైరక్టర్(ఏడీ) పోస్టులను సృష్టించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 12 డీడీ, 13 ఏడీ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెదక్ జిల్లాకు ఈ ఇద్దరిలో ఏ హోదా అధికారి వస్తారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో డీపీఆర్‌ఓతో పాటు, ముగ్గురు డివిజనల్ పీఆర్వోలు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో రంగారెడ్డి జిల్లా డివిజనల్ పీఆర్వో ప్రణీత్ డిప్యూటేషన్‌పై మెదక్ జిల్లా డీపీఆర్‌ఓగా పనిచేస్తున్నారు.

సిద్దిపేట డివిజనల్ పీఆర్వో ఆరోగ్య కారణాలతో చాలాకాలంగా సెలవులో ఉన్నారు. మెదక్, సంగారెడ్డిలో డివిజనల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన పబ్లిసిటీ అసిస్టెంట్ నాగభూషణంకు పౌర సరఫరాల విభాగం ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వేతనం చెల్లిస్తూ మెదక్ డివిజన్ బాధ్యతలు అప్పగించారు. రెండు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(ఏపీఆర్‌ఓ) పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. ఆరుగురు పబ్లిసిటీ అసిస్టెంట్లకు గాను ఇద్దరే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు నల్గొండ జిల్లా నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారే కావడం గమనార్హం. ఫొటోగ్రాఫర్ లేకపోవడంతో ఆర్‌వీఎం ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఓ వ్యక్తిని నియమించి నెట్టుకొస్తున్నారు. ఉన్న ఒక్క ఆడియో విజువల్ పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టూ ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టని ప్రభుత్వం అధికారుల పోస్టులను మాత్రం ఉదారంగా మంజూరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు