బదిలీ గుబులు

30 Oct, 2014 00:30 IST|Sakshi

 ఏలూరు : ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు బదిలీ గుబులు పట్టుకుంది. ఆర్ అండ్ బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల్లోని జోనల్, జిల్లాస్థాయి ఉద్యోగులకు గత నెలలో బదిలీ కౌన్సెలింగ్ పూర్తిచేశారు. అయితే, వారికి ఉత్తర్వులు ఇవ్వాలా, వద్దా అన్న గందరగోళంలో అధికారులు ఉన్నారు. బదిలీలు చేపట్టేందుకు ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉంది. హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో వాయిదాపడిన జన్మభూమి గ్రామసభలను నవంబర్ 1నుంచి నిర్వహించాల్సి ఉండటంతో ఈలోగా ఉద్యోగుల్ని బదిలీ చేయూలా, చేయకూడదా అనేది అధికారులకు తోచడం లేదు. ఒకవేళ కౌన్సెలింగ్ పూర్తయిన వారికి బదిలీ ఉత్తర్వులు ఇస్తే.. వారు జన్మభూమి సభలు పూర్తయ్యాక మాత్రమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. బదిలీ అయిన ఉద్యోగి కొత్త స్థానంలో చేరడానికి వారం నుంచి 15 రోజుల వరకు సమయం ఇవ్వాల్సి ఉంది. నవంబర్ 13 నుంచి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆలోగా ఈ పక్రియ పూర్తికాకపోతే ఇక బదిలీల ఊసే ఉండకపోవచ్చని తెలుస్తోంది.
 
 ఎటూ తేల్చని ప్రభుత్వం
 అవసరమైన శాఖల్లోనే బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ఎన్జీవో జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇది జరిగి వారం గడుస్తున్నా.. ఈ విషయమై ప్రభుత్వ శాఖలకు ఎలాంటి సమాచారం రాలేదు. ఏ విషయం తేలకపోవడంతో ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖల్లో బదిలీ కౌన్సెలింగ్ వాయిదా వేశారు. మరోవైపు రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల్లో చాలాకాలంగా వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల కోసం వేచివున్న వారిని బదిలీ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ నెల 30న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో బదిలీ ప్రక్రియపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కౌన్సెలింగ్ పూర్తయిన ఉద్యోగులకు ఆ రోజే బదిలీ ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చివరకు బదిలీ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందోనన్న అయోమయం ఉద్యోగులను వెన్నాడుతోంది.
 

మరిన్ని వార్తలు