ప్రభుత్వం పింఛన్‌ ఇవ్వదు.. మీరే ఆదుకోండి..!

4 Mar, 2019 15:41 IST|Sakshi
వృద్ధ దంపతులు, నూకయ్య, సీతమ్మ  

ఆపన్నహస్తం కోసం వృద్ధ దంపతుల ఎదురుచూపులు 

సాక్షి, రామభద్రపురం: ఈ చిత్రంలోని వృద్ధుల పేర్లు నూకమ్మ, సీతయ్య. రామభద్రపురం మండలం గొల్లవీధికి చెందినవారు. ఒక కుమార్తె. ఆమెకు పెళ్లి చేసి పంపించారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆధారం లేక బతుకుబండి భారంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పింఛన్‌ డబ్బులు కూడా రావడం లేదు. వాస్తవానికి నూకయ్యకు 73, సీతమ్మకు 67 ఏళ్లు ఉంటాయి. కానీ ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డుల్లో వయసు తక్కువ పడింది. దీంతో ప్రస్తుతం ఇటీవల తీసుకొచ్చిన 65 ఏళ్లకే పెన్షన్‌ ప్రకారం ఇద్దరికి పింఛన్‌ అందడం లేదు.

మహానేత వైఎస్సార్‌ హయాంలో ఇద్దరికి పింఛన్‌ వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. వృద్ధులు కావడంతో పని చేసేందుకు శక్తి లేదు. ఆస్తులు లేవు. కూమార్తెకు పెళ్లి చేసినా అల్లుడు తాగుబోతు కావడంతో ఆమె పరిస్థితి అలాగే ఉంది. మొన్నటి వరకు ప్రభుత్వం అందించే 10 కేజీల బియ్యంతో కాలం గడిపేవారు. కానీ ఇటీవల నూకయ్య ఆరోగ్యం బాగాలేకపోతే రేషన్‌ కార్డును కుదువ పెట్టేశారు. ఇప్పుడు ఆ బియ్యం కూడా కరువైపోయే. ఈ విషయం మేజర్‌ పంచాయతీ మాజీ సర్పంచ్‌ కె.అప్పారావుకు తెలిసింది. వెంటనే స్పందించి నెలకు 25 కేజీల చొప్పున బియ్యం అందిస్తున్నాడు.

ఇప్పటికైనా దిక్కులేని వారికి దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే  91824 35104, 98854 08274 నంబర్లకు సంప్రదించాల్సిందిగా అప్పారావు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు