ప్రభుత్వ వైపరీత్యం రైతులకు అండగా నిలవని దైన్యం

26 Nov, 2013 00:57 IST|Sakshi

 కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్:
 ప్రభుత్వ వైఖరితో అత్యవసర సాయానికి అర్థమే మారిపోతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) అందజేతలో మీనమేషాలు లెక్కిస్తోంది. 2010లో సంభవించిన జల్ తుపాను నుంచి నిన్న మొన్న తుపానుతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ ఎలాంటి సహాయాన్ని అందించలేకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు 50 శాతం కంటే ఎక్కువ నష్టం కలిగితే ఆరు నెలల్లోపే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలయ్యేది. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ హయాంలో ఆ పరిస్థితి లేకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
  2010లో వచ్చిన జల్ తుపాన్ మొదలుకొని గత నెల 22 నుంచి 27వ తేదీ వరకు తుపాను ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాల వరకు దెబ్బతిన్న పంటలకు రూ.64 కోట్ల పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) విడుదల కావాల్సి ఉంది. దీనికోసం 1.12 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర కారణంగా.. బాధిత రైతులు పరిహారం కోసం జిల్లా కలెక్టర్, జేడీఏ, వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నా బుట్టదాఖలవుతుండటం గమనార్హం. 2011లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించారు. దాదాపు 2.50 లక్షల మంది రైతులకు రూ.125 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. ఇంకా 35వేల మంది రైతులకు రూ.22 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. రైతుల నుంచి బ్యాంకు ఖాతాలు తీసుకున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తం కూడా ఉంది. కొద్దిరోజుల్లో ఖాతాలకు జమ చేస్తారని భావిస్తుండగా ప్రభుత్వం నీలం తుపాను బారిన పడిన జిల్లాలకు ఈ మొత్తాన్ని మళ్లించి ఇక్కడి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.
 
 2012లోను కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. మొదటి విడతలో రూ.197 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. ఇంకా 43,287 మందికి పరిహారం విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వంలో చలనం లేకుండాపోయింది. గత నెల 22 నుంచి 27వ తేదీ వరకు తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు దాదాపు 5వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 4,500 మంది రైతులు నష్టపోయారు. వీరికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.4 కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.
 
  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలకు 17 మండలాల్లో పంటలకు రూ.300 కోట్లు నష్టం జరిగిందని, 40 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని మొదట ప్రాథమికంగా అంచనా వేశారు. ఎన్యుమరేషన్ తర్వాత 5వేల ఎకరాలకు లోపే పంటలు దెబ్బతిన్నాయని తేల్చారు. భారీ వర్షాల వల్ల 8000 ఇళ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఇళ్లకు తూతూమంత్రంగా పరిహారం పంపిణీ చేశారు. రోడ్లు భారీగా దెబ్బతిన్నా వాటి మరమ్మతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా పట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు