సర్కారు హత్యే

16 Mar, 2019 08:21 IST|Sakshi

సాక్షి, అనంతపురం:  హత్యలతో ఊరూవాడా ఉలిక్కిపడుతోంది. దౌర్జన్యాలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ‘ఎన్నికలయ్యాక మీ ఇష్టం. చంపుకుంటారో, నరుక్కుంటారో.. నేను చూసుకుంటా’ అని ధర్మవరం ఎమ్మెల్యే సూరి స్వయంగా కత్తులు చేతికిచ్చి మారణహోమానికి ఉసిగొల్పుతున్న తీరు, రాప్తాడులో ‘టీడీపీలో చేరకపోతే ఎన్నికలయ్యాక పరిస్థితులు మరోలా ఉంటాయి’ అని పరిటాల వర్గీయుడు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే హెచ్చరికలు చేయడం చూస్తే.. ఈ ప్రభుత్వం ఎంతలా బరితెగించిందో అర్థమవుతోంది. తాజాగా మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతం రాష్ట్రంలో రక్తం మరిగిన ప్రభుత్వ తీరుకు అద్దం పట్టింది. ప్రశ్నార్థకంగా మారిన శాంతిభద్రతలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

అనాగరికులు 
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారు నాయకులు కాదు అనాగరికులు. రాజకీయాల్లో హత్యలనేవి చాలా అనాగరికమైనవి. నాగరికత నేర్చుకుని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ఇప్పటికీ ఇలాంటి దరిద్రం ఉండడం బాధాకరం. రక్తం శరీరంలో, నేలపై నీళ్లు పోరాలి. మన దౌర్భాగ్యమేమంటే రాయలసీమలో నేటికీ చాలా ప్రాంతాల్లో శరీరంలో పారాల్సిన రక్తం భూమిపై పారుతోంది. తక్కిన ప్రాంతాల్లో నాయకులు నీళ్లు పారించుకోవడంతోనే వారి ప్రాంతాలు అభివృద్ధి చేసుకున్నారు. మన ప్రాంత నాయకులకు నీళ్లపైన శ్రద్ధ లేదుకా>ని రక్తం పారించడంలో శ్రద్ధ చూపుతున్నారు. ఇలాంటి నాయకులను రాజకీయ సమాధి కట్టాలి.  
– తలారి పీడీ రంగయ్య, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త  

అధికార పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట  
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటన హత్యారాజకీయాలకు, టీడీపీ దుర్మార్గానికి పరాకాష్ట. అత్యంత మృదు స్వభావి, కనీసం చిన్నపిల్లలకు హానీ చేయని వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. ఆయన మృతి వార్త బాధకలిగించింది. అయితే అది హత్య అని తెలియడం నన్ను కలిసివేసింది. ఈ హత్యతో రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దివాళాకోరు ఆలోచన చేస్తున్నారు. మా ప్రాణాలను సైతం అడ్డువేసి అధికార పార్టీ దౌర్జాన్యాలు, ఆగడాలను ఎండగడతాం.  
– గోరంట్ల మాధవ్, వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త 

హత్యా రాజకీయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
హత్యా రాజకీయాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఎన్నికల తరుణంలో మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రతిపక్ష నాయకుని పినతండ్రికే ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేక పోయింది. ఇక సామాన్య ప్రజలకు ఏ మేరకు రక్షణ  కల్పిస్తుంది. ప్రతిపక్షపార్టీ వారిని చంపుతామంటూ ఇటీవల అధికారపార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యనించడం చూస్తే ఎన్నికల్లో హింసాత్మకంగా గెలవాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ మద్దతుతోనే హత్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. 
– వి.రాంభూపాల్, సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి 
 

ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి 
ఐదేళ్ల టీడీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులకే రక్షణ లేకుండా పోయింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య చాలా దుర్మార్గమైన చర్య. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ హత్యకు టీడీపీ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. హత్యారాజకీయాలను బీజేపీ ఖండిస్తుంది.  
– విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు   

మరిన్ని వార్తలు