ప్రభుత్వ భూములపై పచ్చ నేతల పంజా..!

6 Apr, 2019 11:10 IST|Sakshi
గుండ్లసముద్రం పంచాయతీ పడమటి పొలాల్లో ఆక్రమణ గురైన భూమి

సాక్షి, మర్రిపూడి (ప్రకాశం​): మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారు.  తాడితోపు, డొంక, కుంట పొరంబోకు భూములను సైతం వదలకుండా యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. మండలంలో దాదాపు రెండు వేల ఎకరాలు పశువులమేత పోరంబోకు భూములు ఉన్నాయి. టీడీపీకి చెందిన కొందరు స్వార్థపరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించుకుంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయం అధికారులకు తెలిసినా అధికారులు పట్టించుకోలేదు.

అడిగేదెవరు..ఆక్రమించేద్దాం..
మండలంలోని కూచిపూడి గ్రామానికి పడమర వైపున సర్వే నంబర్‌ 637–1లో 381.33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొన్నేళ్లుగా మండలంలోని చెంచిరెడ్డిపల్లి, తిప్పలదేవిపల్లి, అంకేపల్లి, మర్రిపూడి, వైకుంఠాపురం, గంగపాలెం తదితర గ్రామాలకు చెందిన పశుపోషకులు గేదెలు, మేకలు, గొర్రెలు, ఆవులను మేపుకుంటున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్ల కన్ను కొండప్రాంతంలో ఉన్న ప్రభుత్వభూమిపై పడింది. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా రాత్రికి రాత్రి ప్రాక్‌లైన్‌ సహాయంతో చెట్లు తొలగించి దాదాపు 180 ఎకరాల భూమిని దున్నేసి ఆక్రమించుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు.  ర్‌అలాగే మండలంలో 2500 ఎకరాలకు పైగా తాడితోపు, వాగు, కుంట, దోవ పోరంబోకు భూములు ఉన్నాయి. కొందరు స్వార్ధపరులు ఎక్కడ పడితే అక్కడకు ఆక్రమించుకుంటూ పోతున్నారు. దీంతో పంట పొలాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు, పశుపోషకులు ఆందోళనకు గురౌతున్నారు.

టీడీపీ నేతల కబంధ హస్తాల్లో..
మర్రిపూడి మండలంలో గుండ్లసముద్రం పంచాయతీ ఎస్టీ రాజుపాలెం, మర్రిపూడి పంచాయతీ గంగపాలెం, వేమవరం రెవెన్యూ పరిధి గ్రామాల్లో, గార్లపేట రెవెన్యూ పరిధిలోని నర్సాపురం, కూచిపూడి పంచాయతీ తిప్పలదేవిపల్లి గ్రామాల్లో అత్యధికంగా పోరంబోకు భూములు ఉండటంతో ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఎక్కడపడితే అక్కడికి భూములు దున్నుకుని యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. మండలంలోని తిప్పలదేవిపల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు 600 ఎకరాలు, గంగపాలెం గ్రామానికి పడమర కొండవైపున దాదాపు 105 ఎకరాలు పోరంబోకు భూమి, ఎస్టీ రాజుపాలెంలో 300 ఎకరాలు పశువుమేత పోరంబోకు భూములు ఉన్నాయి.

ఈ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకొని దున్నుకొని సాగు చేయడంతో ఆయా గ్రామాల్లో ఉన్న గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మేపుకునేందుకు గడ్డి లేక ఇబ్బందులు పడుతున్నాయి. కనీసం ఈ పొలాల్లోకి వెళ్లేందుకు మార్గంలేక పోషకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఎస్టీ రాజుపాలెం గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మండలంలోని గంగపాలెం పశుపోషకులు తమ పశువులు మేపు కోసం కొండ ప్రాంతానికి వెళ్లే మార్గంలేక ఇబ్బంది పడుతున్నామని, న్యాయం చేయాలని రహదారికి అడ్డుగా కంచె వేసి ఆర్‌అండ్‌బీ రహదారిపై పశువులతో ధర్నాకు సైతం దిగారు.

ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారు
టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా పోరంబోకు భూములను దోచుకుంటున్నారు. ఎక్కడపడితే అక్కడ కట్టలుపోసుకోవడం, రాత్రికి రాత్రి చెట్లు తొలగించడం, చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
- డి.మాధవరెడ్డి

పశువులు తిరగడానికి కూడా స్థలంలేదు
పశువులమేత, కుంటు, దారి, తాడితోపు తదితర పోరంబోకు భూములు ఆక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో మూగజీవాలను పొలాల్లో తిప్పే స్థలంలేక పశుపోషకులు అల్లాడిపోతున్నారు. ఆక్రమణ లోఉన్న పోరంబోకు భూములకు విముక్తి కల్పించాలి.
- పి.శ్రీనివాసరెడ్డి

సెంటుభూమి కూడా పంపిణీ చేయలేదు
టీడీపీ ప్రభుత్వంలో దళితులకు సెంటుభూమి కూడా పంపిణీ చేయలేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 7 విడతల్లో దాదాపు 500 ఎకరాల భూమిని దళితులకు పంపిణీ చేశారు.  భూ పంపిణీ చేయకపోగా ఉన్న భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. 
- కొండ్రు శ్యాంబాబు, ఎమ్మార్పీస్‌ మండల అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు