ఫ్రీ కరెంట్ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర

1 Oct, 2013 01:49 IST|Sakshi

 ఖమ్మం, న్యూస్‌లైన్
 వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేందుకు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యుత్ సరఫరాతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతోందని భావించిన ప్రభుత్వం.. దీన్ని ఎలా రద్దు చేయాలని కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ముందుగా విద్యుత్ వినియోగం లెక్కల పేరుతో ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు  బిగించి లెక్కతేల్చేందుకు ట్రాన్స్‌కో అధికారులు రంగంలోకి దిగారు.
 
 రైతును రాజుగా చూడాలనే తపనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. మహానేత పాలనలో రైతులకు ఏడుగంటల విద్యుత్ సరఫరా చేయడంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. అయితే ఆయన మరణానంతరం అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని రైతులను చులకనగా చూశారు. ఏడు గంటలు కాదుకదా మూడు గంటలు కూడా సక్రమంగా సరఫరా చేసిన పాపాన పోలేదు. ఉచిత విద్యుత్‌కు అత్యధికంగా సబ్సిడీ ఇవ్వాల్సి వస్తోందని భావించిన ప్రభుత్వం దీనిని ఎత్తివేసేందుకు నాలుగు నెలల క్రితమే నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరిగింది.
 
  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. కాగా, ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ కోసం డిస్కం ఒత్తిడి పెంచింది. దీంతో రైతులకు షాక్ ఇచ్చేలా ఉచితంగా సరఫరా చేసే విద్యుత్‌కు లెక్కలు వేసి బిల్లులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంపుసెట్ల వద్ద మీటర్లు బిగిస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతోంది. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా అయ్యేట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు అమర్చి ప్రతి కనెక్షన్‌కు లింక్ చేస్తుంది. అనంతరం నెలనెలా విద్యుత్ వినియోగం రీడింగ్ తీస్తుంది. ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో ఉన్న కనెక్షన్లలో 5 హెచ్‌పీ, 3 హెచ్‌పీల లెక్క ప్రకారం సగటున ఒక్కో పంప్‌సెట్‌కు అయిన విద్యుత్ వినియోగాన్ని లెక్కవేస్తుంది. ఈ విధంగా బిల్లులు వసూలు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.
 
 జిల్లా వ్యాప్తంగా 350 మీటర్లు అమర్చిన అధికారులు..
 జిల్లాలోని వ్యవసాయ పంప్‌సెట్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి వాటికి మీటర్లు అమర్చే పనిలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు 8లక్షలకు పైగా ఉండగా, అందులో వ్యవసాయ కనెక్షన్లు 90 వేలు ఉన్నాయి. మీటర్లు బిగించేందుకు 100 కేవీ, 63 కేవీ, 25 కేవీ, 16 కేవీ.. ఇలా మొత్తం 350 ట్రాన్స్‌ఫార్మర్లను ఎంపిక చేశారు. ఇందులో ఖమ్మం డివిజన్‌లో 57, సత్తుపల్లిలో 102, కొత్తగూడెంలో 97, భద్రాచలం డివిజన్‌లో 94 ఉన్నాయి. ఇందులో 100 కేవీ ట్రానుఫార్మర్లకు 95 మీటర్లు, 63 కేవీకి 68, 25 కేవీకి 145, 16 కేవీకి 45 మీటర్లు అమర్చాలని ఉన్నతాధికారులు అదేశించడంతో జిల్లా అధికారులు ఆ మేరకు పనులు ప్రారంభించారు.
 
  ఈ మీటర్ల ద్వారా రీడింగ్ అంచనా వేసి షరతులతో కూడిన ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నెలకు 75 నుంచి 100యూనిట్ల విద్యుత్ వినియోగించిన వారికి మాత్రమే ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే మామూలు వ్యవసాయానికే 200 యూనిట్లకు మించిన విద్యుత్ అవసరమని, ఇలా షరతులు పెట్టి క్రమంగా ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని, ఇప్పుడు విద్యుత్ భారం కూడా పడితే ఇక సాగు కష్టమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు