‘ఉపాధి’ చూపే వర్సిటీలకే రాయితీలు

23 May, 2017 01:51 IST|Sakshi
‘ఉపాధి’ చూపే వర్సిటీలకే రాయితీలు

- వేరే పనుల వల్లే ‘పాఠాలు’ చెప్పలేకపోతున్నారు
ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలి: గవర్నర్‌ నరసింహన్‌


అనంతపురం టౌన్‌ : ఉపాధి అవకాశాలు చూపించే విశ్వవిద్యాలయాలకే ప్రభుత్వ రాయితీలు అందాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. నాణ్యమైన విద్య, ఆరోగ్యాన్ని అందిస్తూ ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం సోమవారం అనంతపురం చేరుకున్న ఆయన రాత్రి  కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశాలు కల్పించేలా నేటి విద్యా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. ఎన్ని యూనివర్సిటీలు క్యాంపస్‌ సెలెక్షన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయో పరిశీలించుకోవాలని అన్నారు. పాఠశాలల్లో నైతిక విలువలు పెంపొందించాలని సూచించారు.

గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. అందుకు అనుగుణంగా ఆట స్థలాలు ఉండేలా చూడాలన్నారు. సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు సాగాలని చెప్పారు. ఉపాధ్యాయులను ఎక్కువ శాతం ఎన్నికలు, ఇతర పనులకు వినియోగించడం వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడం తగ్గిపోతోందని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో శుభ్రత పాటించాలని అలన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని, గోదాముల సౌకర్యం కల్పించాలని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం లేకుండా ముందు నుంచే ప్రత్యేక డివైజ్‌ను రూపొందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు పోలీసు శాఖ రూపొందించిన ‘యాప్‌’ బాగుందని, దాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేవాలని ఎస్పీకి సూచించారు.

మరిన్ని వార్తలు