తాత, బామ్మకు పెళ్లి.. చేశారు మళ్లీ

15 Jan, 2016 00:48 IST|Sakshi

గుండేపల్లి (నల్లజర్లరూరల్) : మనుమలు, మునిమనుమలతో సహా వారసులంతా ఒక్కచోట చేరి తాతా, బామ్మలకు పెళ్లి చేశారు. ఇన్నాళ్ల వారి దాంపత్య జీవితాన్ని తీయగా పండించుకున్న వారికి ఈ షష్టిపూర్తి పండగ పూట ఓ చిరుకానుక అయ్యింది. తమ వారసులు మళ్లీ పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఆ రెండు మనసులు మురిసిపోయాయి. బోసి నవ్వుతో తాత, బామ్మలు పులకించిపోయారు. నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల పుల్లయ్యకు 102 సంవత్సరాలు. ఆయన భార్యకు 94 సంవత్సరాలు.
 
 ఈ వయసులోనూ ఎవరికీ భారం కాకుండా ఇప్పటికీ ఆ జంట తమ పనులు తామే చేసుకుంటూ, తమ వంట తామే చేసుకుంటూ జీవిస్తున్నారు. గురువారం ఆ దంపతులకు వారి కుమారులు, మనవళ్లు, మనవరాండ్రు మొత్తం 69 మంది షష్టిపూర్తి ఉత్సవం నిర్వహించి ఊరంతా భోజనాలు పెట్టారు. వారి సంతానం అంతా వ్యవసాయ కూలీలుగానే ఉంటున్నా వారి ప్రేమలను చూసి గ్రామస్తులు సరదాపడ్డారు. వారంతా ఇదే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు.
 

మరిన్ని వార్తలు