ధైర్యశాలి.. దార్శనికుడు

17 Aug, 2018 13:11 IST|Sakshi
వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పిస్తున్న బీజేపీ నాయుకులు 

మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతితో దిగ్భ్రాంతి

జిల్లాతో ఆయనకు రాజకీయ అనుబంధం

మృతికి సంతాపం తెలిపిన అన్ని వర్గాలు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థపక అధ్యక్షుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణంతో జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా 1968లో జనసంఘ్‌లో చేరి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్తగా పనిచేస్తూ బీజేపీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ధైర్యశాలి అంటూ ఆయనను కొనియాడారు. మంచి వక్త, దార్శనికుడైన ఆయన మరణం దేశానికి తీరని లోటని వాపోయారు. 

గ్రామాభివృద్ధి ఆయన చలవే

శ్రీకాకుళం నగరంలో డే అండ్‌ నైట్‌ కూడలిలో మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి మృతికి బీజేపీ రాష్ట్రకార్యదర్శి పైడి వేణుగోపాలం సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈయన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు, తాగునీరు, మహిళాదీపం పథకం, కిసాన్‌క్రెడిట్‌ కార్డులు, అంత్యోదయ కార్డులకు 35 కేజీలు బియ్యం అందించిన మహనీయుడు అని ప్రశంసించారు.

అసంఘటిత కార్మికుల కోసం ఎన్నో పథకాలు రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా దుప్పల రవీంద్రబాబు, బీజేపీ యువ నాయుకుడు జిల్లా అధ్యక్షుడు బత్తుల పవన్‌సాయి, నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, మహిళా నాయకురాలు శవ్వాన ఉమామహేశ్వరి, సంపతిరావు నాగేశ్వరరావు, పండి యోగేశ్వరరావు, అల్లు మల్లేశ్వరరావు, ఎస్‌.వి రమణమూర్తి, పసుపులేటి సురేష్‌సింగ్, శవ్వాన వెంకటేశ్వరరావు, బెండి రవికాంత్, దయాసాగర్, ఎస్‌.వి రమణమూర్తి, పూజాకి చెల్లయ్య, కీర్తి శాంతారావు, దొంతం చంద్రశేఖరరావు పాల్గొన్నారు. 

జిల్లాతో అనుబంధం ఇలా

1983 జనవరిలో అçప్పటి హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలో బీజేపీ తరఫున సంపతిరావు రాఘవరావు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కోటబొమ్మాళిలో ఏర్పాటుచేసిన సమావేశానికి వాజ్‌పేయి హాజరయ్యారు. అదే రోజు అదే నియోజకవర్గానికి కాంగ్రెస్‌ నాయకురాలు ఇందిరా గాంధీ హెలికాఫ్టర్‌లో వస్తే.. ఆయన మాత్రం ఒక సాధారణ వ్యక్తిలా అంబాసిడర్‌ కారుతో వచ్చారు. ఈ సభలో ఆయన చేసిన హిందీ ప్రసంగాన్ని తెలుగులో ప్రధాన కృష్ణమూర్తి అనువదించారు. తర్వాత శ్రీకాకుళంలోని వంశధార అతిథి గృహానికి వెళ్లి అక్కడ కొంతసేపు విరామం తీసుకుని తిరిగి పయనమయ్యారు.

కొవ్వొత్తులతో నివాళులు

కాశీబుగ్గ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాపంగా గురువారం పలాస–కాశీబు గ్గ పట్టణంలో పలాస యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి 8గంటలకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించి ర్యాలీ నిర్వహించారు.

భారతీయుల హృదయంలో చిరస్మరణీయుడు!

‘‘యుక్త వయసు నుంచే గొప్ప జాతీయ భావాలు, దేశభక్తి కలిగిన నాయకుడు వాజ్‌పేయి. నిస్వార్థమైన, మచ్చలేని జీవితం గడిపారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ సుశిక్షితుడే అయినా హిందూయేతర మతస్థులకూ ఆమోదయోగ్యమైన ప్రధానమంత్రిగా నిలిచారు. ఈ పదవేదో ఆయనకు ఏ ఆకస్మిక రాజకీయ పరిణామాలతో వచ్చిందికాదు. వాజ్‌పేయి ప్రధాని అవుతారని ఆయన పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగుపెట్టినప్పుడే భారతదేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూ నుంచి ప్రశంసలు పొందారు. గొప్ప వ్యక్తిత్వం వాజ్‌పేయి సొంతం. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా భారతీయుల హృదయంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు’’.

– ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర మాజీ మంత్రి

వాజ్‌పేయితో ఎంతో అనుబంధం

వాజ్‌పేయి జిల్లాకు 1983లో వచ్చినప్పుడు మా నాన్న అట్టాడ అప్పలనాయుడితో కలిసి ఎమ్మెల్సీ పి.వి.చలపతిరావుతో పాటు నేను ఈ సభకు వెళ్లాం. అనంతరం 1996లో వెంకయ్యనాయుడు కుమార్తె వివాహ వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహిస్తే మళ్లీ కలిసి భోజనం కూడా చేశాం. నాతో పాటు ఆమదాలవలసకు చెందిన గురుగుబెల్లి వెంకటరావు మాస్టారు కూడా ఉన్నారు. అప్పట్లో బీజేపీలో చేరాను. 

– అట్టాడ రవిబాబ్జీ, బీజేపీ నాయకుడు

ఆయన ప్రసంగమే రాజకీయాల్లోకి మళ్లించింది

వాజ్‌పేయి జిల్లాకు వచ్చిన మొదటిసారి మా నాన్న పూడి మల్లేశ్వరరావుతో కలిసి 1983లో కోటబొమ్మాళిలో ప్రచార సభకు హాజరయ్యాను. ఆ సభలో ప్రసంగం విన్నాక ఆయన అభిమానిని అయ్యాను. విద్యార్థిగా ఉన్నప్పటికీ పార్టీలో చేరాలన్న ఆశ కలిగింది. విద్యార్థి నాయకుడిగా పార్టీలో చేరా. ఆయన ప్రధానమంత్రి అయ్యాక భారతదేశంలో నేషనల్‌ హైవే రోడ్లు వేసేందుకు ‘వెలిగిపోతోంది భారత్‌’ అనే నినాదం చేపట్టారు. రహదారులు వేయడంతో ఇతర దేశాల నుంచి ప్రాంతాల నుంచి వ్యాపారాలు పుంజుకుని దేశ ఆర్ధిక అభివృద్దికి దోహదపడ్డాయి. 

– పూడి తిరుపతిరావు, బీజేపీ నాయకుడు

వాజ్‌పేయి మరణం తీరని లోటు

స్వచ్ఛమైన రాజకీయాలతో దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం రాజకీయలోకానికి తీరని లోటు. 1983లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గంగా ఉన్నపుడు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశా. నా గెలుపు కోసం కోటబొమ్మాళిలో బహిరంగ సభ నిర్వహించారు. అప్పట్లో ఆ సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో పలు చోట్ల స్వర్ణ త్రిభుజాకార రహదారులు వేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి వాజ్‌పేయీ ఎనలేని కృషి చేశారు. స్వచ్ఛమైన రాజకీయాలకు చిరునామాగా ఉన్న ఆయన మరణం రాజకీయ లోకానికి తీరని లోటు.

– సంపతిరావు రాఘవరావు, మాజీ ఎంపీపీ, టెక్కలి

మరిన్ని వార్తలు