గుణదల భూమి గుటకాయస్వాహా..!

27 Mar, 2017 08:41 IST|Sakshi
గుణదలలో సర్వేచేసిన విద్యుత్‌ సౌధ ప్రాంగణం

చినబాబు కోసం ఎంతకైనా సిద్ధం
అది ప్రభుత్వ భూమి అంటూ కొత్త వాదన
ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి తిరిగి తీసుకుంటుందట!
గుట్టు చప్పుడు కాకుండా కదులుతున్న ఫైల్‌


సాక్షి, అమరావతి: విజయవాడ గుణదలలోని భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా విద్యుత్‌ సంస్థల అధీనంలో ఉన్న భూమి అది. అయినా సరే చినబాబు కోసం ఆ భూమిని లాగేసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వమే ఇచ్చింది కనుక తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందనే కొత్త వాదన తెరపైకి తెస్తోంది. ఆ మేరకు నివేదికలు కూడా తయారు చేయించినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలకు ఉన్న భూములన్నీ చాలావరకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములే. అలాగని అవసరం వచ్చినప్పుడో, సొంత ప్రయోజనాల కోసమే తిరిగి వాటిని లాగేసుకుంటే  ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా భూమి మిగిలే అవకాశం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ట్రాన్స్‌కో, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌)కు చెందిన సుమారు రూ.200 కోట్ల విలువైన 4.80 ఎకరాల భూమిని బినామీల ముసుగులో దక్కించుకునేందుకు చినబాబు, ప్రభుత్వ పెద్దలు పథకం వేసిన సంగతి తెలిసిందే. తొలుత రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే పేరిట ఓ స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు ప్రైవేటు వ్యక్తులకు ఈ భూమిని అప్పగిస్తారు.

హోటల్‌ నిర్మించి కొన్నాళ్లు నడిపిన తర్వాత ముందుగా కుదుర్చుకున్న ఒప్పంద ప్రకారం ఆ హోటల్‌ను చినబాబుకు అప్పగించేస్తారు. ఇదీ స్కెచ్‌. స్కెచ్‌లో భాగంగా వారం రోజుల క్రితం పర్యాటక శాఖ విద్యుత్‌ సంస్థల భూమిని సర్వే చేసింది. అయితే విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు ఆ సర్వేను అడ్డుకున్నాయి. తమ అనుమతి లేకుండా తమ భూమిలో సర్వే ఏంటని ప్రశ్నించాయి. దీంతో వెనుదిరిగిపోయిన పర్యాటక శాఖ తాజాగా అసలుకే ఎసరు పెట్టింది.

విద్యుత్‌ సంస్థల భూమే కాదట
గుణదల భూమి విద్యుత్‌ సంస్థలదే కాదంటూ పర్యాటక శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీన్ని అడ్డుపెట్టుకుని ఆ స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఫైల్‌ కూడా సిద్ధమైనట్లు సమాచారం. ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో.. గతంలో ప్రభుత్వమే ఇచ్చిన స్థలం కాబట్టి తిరిగి ఎప్పుడైనా తీసుకునే హక్కు ఉందని ఉన్నతాధికారులు చెప్పడం విశేషం.

1954లో ఏపీఎస్‌ఈబీకి ప్రభుత్వం ఈ స్థలం ఇచ్చిన మాట నిజమేనని, ఒక్క ఏపీఎస్‌ఈబీకే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో అనేకచోట్ల విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వమే భూమి ఇచ్చిందని, అంతమాత్రాన తిరిగి తీసుకుంటామంటే ఎలా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలను ఉన్నతాధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది.

ప్రభుత్వమే ఇస్తే తీసుకునే హక్కు ఉంటుంది: అజయ్‌ జైన్‌
ఈ భూమి ప్రభుత్వం ఇచ్చినదే అయితే తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పారు. ఇప్పటివరకు ఈ భూమిని ఎవరికీ అప్పగించలేదని, గుణదలలో ఉన్న భూమి విద్యుత్‌ సంస్థలు కొనుగోలు చేశాయా? ప్రభుత్వం ఇచ్చిందా? అనేది తెలుసుకోవడానికే సర్వే జరిగిందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు