అక్రమార్కులకు ముచ్చెమటలు

19 Aug, 2019 06:26 IST|Sakshi
అక్రమ నిర్మాణాల్ని కూలగొడుతున్న జీవీఎంసీ సిబ్బంది

నిబంధనలు పాటించని భవనాలపై ఉక్కుపాదం

రెండో విడత డ్రైవ్‌ ప్రారంభించిన జీవీఎంసీ పీలా అక్రమ భవనంతో సహా ఎనిమిదింటిపై చర్యలు

ఇప్పటికే కొన్ని భవనాలకు నోటీసుల జారీ 

బీపీఎస్‌ దరఖాస్తుల ఆధారంగానే కూల్చివేతలు

మరోసారి స్పెషల్‌ డ్రైవ్‌ మొదలైంది. అక్రమాల పునాదులు కదులుతున్నాయి.. ఇన్నాళ్లూ టీడీపీ ప్రభుత్వ హయాంలో కళ్లముందే తప్పు జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయతతో చేతులు ముడుచుకున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు.. మరోసారి జూలు విదిల్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమవుతున్న భవనాలపై ఉక్కుపాదం మోపారు. గెడ్డను ఆక్రమించేసి అడ్డంగా ఐదంతస్తులు నిర్మించేస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ భవనంపై సమ్మెటపోటు పడటంతో.. జీవీఎంసీ రెండో విడత డ్రైవ్‌ ప్రారంభించింది. బీపీఎస్‌ దరఖాస్తుల ఆధారంగా అక్రమ భవనాలను గుర్తించి వాటిని కూలగొట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

సాక్షి, విశాఖపట్నం: బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి... అనధికార నిర్మాణాల్ని జేసీబీలతో కూలగొడుతుంటే.. వెన్నులో వణుకుపుట్టింది. సమ్మెటలతో నిర్మాణాల్ని ఛిద్రం చేస్తుంటే.. కబ్జాదారులకు చెమటలు పట్టాయి. టీడీపీ ఎమ్మెల్యేల అండతో నిబంధనలంటే లెక్కలేనితనంతో విచ్చలవిడిగా పెరిగిన అనధికార నిర్మాణాలపై జీవీఎంసీ స్పెషల్‌ డ్రైవ్‌ మరోసారి మొదలైంది. ఐదేళ్ల కాలంలో పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్న సిబ్బంది వాటిని కూలగొడుతున్నారు. కమిషనర్‌ జి.సృజన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు.. జూన్‌ 26 నుంచి 8 రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రతి వార్డులోనూ జల్లెడ పడుతూ.. అనధికార భవనాలపై చర్యలు తీసుకున్నారు. 8 రోజుల వ్యవధిలో 79 భవనాలను కూలగొట్టారు.

నిరంతర ప్రక్రియగా..
అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నిబంధనలకు తుంగలో తొక్కుతూ టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు చెందిన 5 అంతస్తుల నిర్మాణాన్ని శనివారం నేలమట్టం చేశారు. కోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేతల్ని సాయంత్రం నిలిపేశారు. కేవలం ఈ ఒక్క భవనమే కాకుండా శనివారం జీవీఎంసీ పరిధిలో 8 అక్రమ నిర్మాణాల్ని పడగొట్టేశారు. జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశాలతో మరోసారి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించిన టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది.. దీన్ని నిరంతర ప్రక్రియగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

బీపీఎస్‌ దరఖాస్తుల ఆధారంగా..
పారదర్శంగా ఈ డ్రైవ్‌ చేపట్టాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నిర్ణయించారు. ఎవరిపైనా  కక్షపూరితంగా వ్యవహరించకుండా నిబంధనలకు తిలోదకాలిచ్చి చేపట్టిన నిర్మాణాలపైనే ఉక్కుపాదం మోపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌(బీపీఎస్‌)ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. జీవీఎంసీ పరిధిలో అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు 5,238 దరఖాస్తులు వచ్చాయంటే.. ప్లాన్‌కు విరుద్ధంగా ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటి వరకు 267 భవనాలకు అప్రూవల్‌ ఇచ్చారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ దరఖాస్తుల ఆధారంగా డ్రైవ్‌ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి జోన్‌లోనూ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌(ఏసీపీ)లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఏసీపీ తన జోన్‌ పరిధిలో రోజుకు 5 నుంచి 10 బీపీఎస్‌ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇందులో బీపీఎస్‌ నిబంధనలననుసరించి ఉన్న భవనాలకు అనుమతులు మంజూరు చేయనున్నారు. మిగిలిన భవనాల్ని కూల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ రకంగా టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది అనధికార భవనాలపై అధికారికంగా ఉక్కుపాదం మోపనున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా ఎక్కడ అనధికార నిర్మాణం కనిపించినా, దాని వెనుక ఎంతటివారున్నా వెనుకాడకుండా కూలగొట్టాలని నిర్ణయించారు.

పారదర్శకంగా వ్యవహరిస్తాం..
అనధికార నిర్మాణం ఎక్కడ ఉన్నా.. అది ఎవరిదైనా ఉపేక్షించే ప్రసక్తేలేదు. కమిషనర్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ మళ్లీ ప్రారంభించాం. తొలిరోజున 8 భవనాలపై చర్యలకు ఉపక్రమించాం. దీంతో పాటు ఇప్పటికే కొన్ని భవనాలకు నోటీసులు జారీ చేశాం. వారు ప్రభుత్వానికి అప్పీల్‌ చేసుకున్నారు. దానికి సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి బీపీఎస్‌ వెరిఫికేషన్‌లో తిరస్కరణకు గురైన ప్రతి అదనపు అంతస్తు, భవనాన్ని కూలగొడతాం. నియమాల్ని అనుసరించి పారదర్శకంగా వ్యవహరిస్తాం.  
–ఆర్‌జె విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌   

మరిన్ని వార్తలు