చంద్రన్న సంక్రాంతి కానుక అరకొరే!

9 Jan, 2015 03:52 IST|Sakshi
చంద్రన్న సంక్రాంతి కానుక అరకొరే!

అందిన సరుకులు సగమే
చేతులెత్తేసిన గోధుమపిండి కాంట్రాక్టర్
ఇంకా అందని క్యారీ బ్యాగులు
అధికారుల్లో తీవ్ర ఆందోళన

 
కడప సెవెన్‌రోడ్స్: చంద్రన్న సంక్రాంతి కానుకకు గ్రహణం పట్టింది. సంక్రాంతి పండుగకు పేదలకు అందిస్తామని చెప్పిన ఆరు రకాల సరుకుల్లో ఇప్పటివరకు జిల్లాకు అందింది సగం మాత్రమే. ఇందులో గోధుమపిండి అందే ప్రశ్నే లేదు. చంద్రన్న కానుక అంటూ ఫోటోలు ముద్రించి అటు ప్రచారానికి వాడుకోవాలని తలపెట్టిన క్యారీ బ్యాగులు ఇంతవరకు జిల్లాకు చేరలేదు. ఇప్పటికిప్పుడు అన్నీ సేకరించేందుకు అధికారులు సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి సూచించిన సమయానికి ఆరు రకాల సరుకులను డీలర్లకు అందజేయడం గురించి అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆర్బాటంగా ప్రకటించిన ఈ కార్యక్రమం కూడా మరో రుణమాఫీ అవుతుందేమోనని అటు డీలర్లు, అధికారుల్లో భయం పట్టుకుంది.  పేదల ఇంట ఈ సంవత్సరం నిజమైన సంక్రాంతి జరుగుతుందని ఆర్బాటంగా చెప్పిన రాష్ట్ర  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటకు గ్రహణం పట్టినట్లయింది. ఈ పండుగకు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఆరు రకాల వస్తువులతో ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాక్‌లో ఒక్కో కార్డుదారుడికి అరకిలో కందిబేడలు, కిలో శనగలు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, అరకిలో పామోలిన్, వంద గ్రాముల నెయ్యి ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో తెల్లకార్డులు 6,42,726, ఏఏవై కార్డులు 59,573, అన్నపూర్ణ కార్డులు 815 వెరసి 7,03,114 ఉన్నాయి. ఈ కార్డులన్నింటికీ కందిబేడలు 351.557 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే, ఇప్పటివరకు 225.854 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరాయి. శనగలు 703.114 టన్నులకుగాను 211.360 వచ్చాయి. ఇక బెల్లం 351.557 టన్నులకుగాను 70 టన్నులు అందాయి. పామోలిన్ 351.557 మెట్రిక్ టన్నులు అందాల్సి ఉండగా, 152 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. నెయ్యి 70.3114 మెట్రిక్ టన్నులకుగాను 30 టన్నులు మాత్రమే చేరింది. ఇక గోధుమపిండి 703.114 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, ఇంతవరకు ఒక్క టన్ను కూడా జిల్లాకు చేరలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన చక్కెర కర్మాగార యజమాని తాను ఐదు జిల్లాలకు గోధుమ పిండిని సరఫరా చేస్తానంటూ కాంట్రాక్టు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సరఫరా చేయలేనంటూ ఆయన చేతులెత్తేశారనే వార్త గురువారం జిల్లా అధికారులకు చేరింది. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ జిల్లాలోనే గోధుమపిండి ప్యాకెట్లను సేకరించి సరఫరా చేస్తే ఎంత ఖర్చు వస్తుందో అంచనాలు వేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో జిల్లాకు అవసరమైన గోధుమపిండి ఇప్పటికప్పుడు లభించే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దీంతో గోధుమపిండి సరఫరాపై అధికారులు ఆశలు వదలుకున్నారు. కడప నగరం సమీపంలోని ఓ ప్రైవేటు గోడౌన్‌లో వచ్చిన సరుకులను వచ్చినట్లుగా ప్యాకింగ్ చేస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో సరుకులను నేరుగా డీలర్లకే చేరవేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. డీలర్లకు క్యారీ బ్యాగులు సరఫరా చేసి ఆరు వస్తువులు అందులో ఉంచి కార్డుదారులకు అందించే బాధ్యతను అప్పగించాలని ఆలోచిస్తున్నారు. కానీ, ఇంతవరకు క్యారీ బ్యాగులు జిల్లాకు రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటనలు మాత్రం ఆర్బాటంగా చేసినప్పటికీ అమలులో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు వారాలుగా ప్రకటనలతో ఊరించి తీరా సమయానికి అరకొర సరుకులతో సరిపెట్టేందుకు ప్రయత్నించడం పట్ల ప్రజల్లో కూడా తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.
 
 
 

మరిన్ని వార్తలు