చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలి

12 Mar, 2017 01:38 IST|Sakshi
చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలి

 హైకోర్టు ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌

తిరుపతి లీగల్‌: వయో వృద్ధులకు రక్షణగా ఉన్న చట్టాలు, హక్కులపై వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉమ్మడి హైకోర్టు ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ చెప్పారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవా సంస్థ, చిత్తూరు జిల్లా న్యాయసేవా సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌ మాట్లాడుతూ... వృద్ధులపై జరిగిన నేరాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలతో కూడిన ప్రత్యేకమైన రిజిస్టర్‌ను ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు.

నిరుపేద వృద్ధుల కోసం ప్రభుత్వాలు దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోందన్నారు. న్యాయసేవా సంస్థలు, చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ సంయుక్తంగా తెలుగులో ముద్రించిన పుస్తకాన్ని జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్‌ సెక్రటరీ పి.రాంబాబు, చిత్తూరు జిల్లా జడ్జి సీహెచ్‌ దుర్గారావు, జిల్లా సంయుక్త కలెక్టర్‌ వెంకటసుబ్బారెడ్డి, తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి నరసింహరాజు, రాష్ట్ర వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డి, 13 జిల్లాల న్యాయసేవా సంస్థల కార్యదర్శులు(న్యాయమూర్తులు), న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు