పాలస్తీనాకు మద్దతుగా సీడబ్ల్యూసీ తీర్మానం

10 Oct, 2023 07:33 IST|Sakshi

ఇజ్రాయెల్‌ భద్రతా దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజల భూభాగం, స్వయం ప్రతిపత్తి, గౌరవం, జీవించే హక్కు కోసం తాము దీర్ఘకాలిక మద్దతునిస్తున్నట్లు స్పష్టం చేసింది. సమస్యల పరిష్కారానికి ఇరుపక్షాలు శాంతియుత చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

ఇజ్రాయెల్ జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలకు భరోసా ఇస్తూ చర్చల ద్వారా పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేరాలని తమ పార్టీ ఎప్పుడూ విశ్వసిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రజలపై హమాస్ ఉగ్రవాదుల క్రూరమైన దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పాలస్తీనాకు మద్దతుగా తాజా ప్రకటన వెలువడింది.

ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్‌ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్‌ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్‌ ప్రకటించింది. 

ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం

మరిన్ని వార్తలు