పొంచివున్న ముప్పు  

27 Sep, 2019 07:57 IST|Sakshi
వంశధార నదిలో దిగువ ప్రాంతానికి ప్రవహిస్తున్న వరదనీరు

 జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఒడిశాను కుదిపేస్తున్న వానలు 

ప్రధాన నదులకు వరద ముప్పు

సాక్షి, శ్రీకాకుళం :  జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల కుంభవృష్టితో జిల్లాలో చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు ఏకమై వరద నీరు పారుతోంది. ఇప్పటి వరకు నిండని చెరువులు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. భారీ ప్రమాదాలు లేనప్పటికీ వర్షాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పలు పాఠశాలల ఆవరణలు, లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, గ్రామాలు, నగరాలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది. ఎక్కువగా నాగావళి, వంశధార, బహూదా నదీ పరివాహక ప్రాంతాల ఇరువైపుల గల వరి, ఇతర పంట పొలాలు జలమయమయ్యాయి. వరి పంట చాలా చోట్ల నీట మునిగింది. జిల్లాలో గురువారం నాటికి 2,899 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం, పాలకొండ డివిజన్ల కంటే ఎక్కువగా టెక్కలి డివిజన్లో వర్షం పడింది. టెక్కలి డివిజన్లో 119.7 మి.మీలు,  శ్రీకాకుళం డివిజన్లో 60.1 మి.మీలు, పాలకొండలో 52.7 మి.మీలు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు 76.3 మిల్లీమీటర్లు.  

ఒడిశా నుంచి వరద బెడద 
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఒడిశాలో వంశధార, నాగావళి, బాహుదా నదులు పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా నుంచి మన జిల్లా వైపు ప్రవహించే డ్యామ్‌లలో నీరు ఎక్కువగా వస్తుంది. సుమారుగా 103 మీటర్ల స్థాయిలో నీరు ప్రవహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీని ప్రవాహ స్థాయి 106 మీటర్లు దాటితే ఆ ప్రభావం జిల్లాలోని నదులపై పడే ప్రమాదం ఉంది. గురువారం కూడా ఒడిశాలో వర్షాలు కురవడంతో వరద ముప్పు ఉండవచ్చని భయపడుతున్నారు.  

జిల్లా యంత్రాంగం అప్రమత్తం 
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. నాగావళి, వంశధార, బాహూదా నదులకు వరద ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం ఆయన అధికారులతో మాట్లాడారు. నదుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. అధికారులు అందుబాటులో ఉండాలని, పరిస్థితులను అంచనా వేయాలని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకొనేందకు సన్నద్ధం కావాలని చెప్పారు. ప్రధానంగా నదీ ప్రవాహ ప్రాంతాల మండలాల వారు అప్రమత్తంగా ఉండాలని, ఆ గ్రామాల ప్రజలకు వరద పరిస్థితి తెలియజేయాలని ఆదేశించారు.  

కలెక్టర్‌కు మంత్రి కృష్ణదాస్‌ ఫోన్‌ 
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్‌ నివాస్‌తో ఫోన్లో మాట్లాడి, జిల్లా వరద పరిస్థితులను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న మూడు రోజులు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయంతో వరద పరిస్థితులను తెలుసుకొని, కావాల్సిన చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు, అందుకు కావాల్సిన సామగ్రీ, ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. వర్షాలు, వరదల వలన పంటకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున, ముందుగానే రైతులను అప్రమత్తం చేయాలని, వారికి కావాల్సిన సాయాన్ని అందించాలని ఆయన ఆదేశించారు.   


కవిటి: గొర్లెపాడు రైల్వే అండర్‌ పాసేజ్‌ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న వరదనీరు

వంశధారలో పెరిగిన వరద నీరు 
హిరమండలం (ఎల్‌.ఎన్‌.పేట):  గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురువారం ఉదయానికే వంశధార నదికి వరదనీరు వచ్చి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలకడగానే ఉన్నట్లు గొట్టా బ్యారేజ్‌ డీఈ ఎం.ప్రభాకరరావు స్థానిక విలేకర్లకు చెప్పారు. ఒడిశాలోని నదీ పరివాహక ప్రాంతమైన కుట్రగడ, గుడారి, మోహన, మహేంద్రగడ, గుణుపూర్, కాశీనగర్‌లతో పాటు మహేంద్రతనయ నదీ పరివాహక ప్రాంతమైన మెళియాపుట్టిలోను అధికంగా వర్షాలు పడటంతో వరదనీరు నిలకడగానే ఉండే అవకాశం ఉందన్నారు. ఆయా ప్రాంతా ల్లో బుధవారం 158 మి.మీ వర్షం పాతం నమోదుకాగా, గొట్ట వద్ద కూడా 63.2 మి.మీ నమోదైనట్లు పేర్కొన్నారు. ఇది సాధారణ వర్షపాతం కంటే ఎంతో ఎక్కువన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీటిని దిగువ ప్రాంతంలోని సముద్రంలోనికి అలాగే విడిచిపెట్టేస్తున్నట్లు వివరించారు. గురువారం రాత్రి 8 గంటల సమయానికి 21 గేట్లను 30 సెంటీమీటర్లు ఎత్తులో ఉంచి 22,650 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెట్టినట్లు డీఈ చెప్పారు. గురువారం ఉదయం నుంచి ఒడిశా ప్రాంతంలో పెద్దగా వర్షాలు లేకపోవడం వలన వరదనీరు పెరిగే అవకాశం కూడా లేదన్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 201 క్యూసెక్కుల నీటిని, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 525 క్యూ సెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు