హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు

17 Aug, 2017 16:07 IST|Sakshi
హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురు అయింది. నేషనల్‌ హైవే అథార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తరఫున జరుపుతున్న భూ సేకరణపై న్యాయస్థానం గురువారం స్టే విధించింది. పోరంకి-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణపై 72మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌హెచ్‌ఏఐ 1956 యాక్ట్ కింద పోరంకి నుంచి మచిలీపట్నం హైవేలో 2009లో భూసేకరణ జరిపి వారికి ఇంతవరకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని పిటిషన్‌ వేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టును కోరారు.

సుమారు ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అక్కడున్న ఇళ్లన్నీ తొలగించారని పిటిషనర్‌ పేర్కొన్నారు. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి కూల్చివేతలు, తరలింపు కార్యాక్రమాలు జరపొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణకు సంబంధించిన రికార్డులన్నీ సెప్టెంబర్ 5 లోపు ఎన్‌హెచ్‌ఏఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు హైకోర్టు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు