చారిత్రక విశేషాల ‘కొండ’

11 May, 2018 12:12 IST|Sakshi
వెలగాడ కొండ

వెలగాడ కొండపై దర్శనమిస్తున్న విజయనగరం రాజుల కోట

రెండు శతాబ్దాల కిందట కొండపై రైల్వే సిగ్నల్‌ బోర్డు ఏర్పాటు  

నెల్లిమర్ల పట్టణాన్ని అనుకుని ఉన్న ఆ కొండ చారిత్రక విశేషాలకు నిలయం. కొండపై ఎప్పుడో నాలుగు శతాబ్దాల కిందట విజయనగరం సామ్రాజ్యానికి చెందిన రాజులు నిర్మించిన కోట దర్శనమిస్తుంది. అప్పట్లో విజయనగరం ప్రభువుతో పాటు పరివారమంతా కొండెక్కి ఆ కోటలో విడిది చేసేవారు.  కొండపై చిన్న కొలను కూడా ఉంది. వేసవిలోనూ ఆ కొలనులో నీరుండటం విశేషం. ఇదీ నెల్లిమర్ల పట్టణం – కొండవెలగాడ గ్రామాల మధ్యనున్న  వెలగాడ కొండ ప్రత్యేకత. దీనికి సంబంధించి ఆనాటి వృద్ధులు చెబుతున్న వివరాల్లోకి వెళ్తే..

నెల్లిమర్ల : విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన పూసపాటి గజపతుల వంశానికి చెందిన మహరాజులు వెలగాడ కొండపై విడిది ఏర్పాటు చేసుకున్నట్టు స్థానికులు చెబుతారు. దీనిలో భాగంగానే కొండపైన కోట నిర్మించుకున్నారు. గుర్రాలు, ఏనుగులు ఎక్కి తమ పరివారంతో కొండనెక్కేవారు. దీని కోసం అప్పట్లో ప్రత్యేకంగా రహదారి ఉండేది. ముందుగా నెల్లిమర్ల పట్టణంలోని ప్రస్తుతం చంద్రబాబు కాలనీ ఉన్న ప్రాంతానికి విచ్చేసేవారు.

ఇక్కడ కొంతసేపు సేద తీర్చుకుని, కొండ ఎక్కేవారు. గుర్రాలు, ఏనుగులు నీరు తాగేందుకు అప్పట్లో ఈ ప్రాంతంలో చిన్నపాటి కొలను తవ్వించారు. ఆ కొలను ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉంది. రాజులు కొండనెక్కే రహదారి మాత్రం కాలక్రమేణా  కనుమరుగైంది. పెద్దపెద్ద చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. కోటకు సమీపంలోనే గుర్రాలు, ఏనుగుల కోసం షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి.

కోట శిథిలమైనా గోడలు మాత్రం చెక్కు చెదరలేదు. పైకప్పు పోయినా కోట ఆకారం మాత్రం కనిపిస్తుంది. కోటకు సమీపంలోనే రైల్వే విభాగానికి సంబంధించిన సిగ్నల్‌ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే రైళ్లకు సైతం ఈ బోర్డు కనిపిస్తుంది. ఈ కొండపైన చిన్నపాటి కొలను ఉంది. మండు వేసవిలోనూ ఈ కొలనులో నీరు ఉంటుంది. గతంలో సమీప గ్రామాల ప్రజలు ఈ కొలనులో స్నానాలు చేసేవారు.

కొండపై నుంచి చూస్తే నెల్లిమర్ల, విజయనగరం పట్టణాలతో పాటు 30 కిలోమేటర్ల మేర అన్ని గ్రామాలు, ప్రాంతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సముద్ర తీరప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. కొండపైన ఇప్పటికీ పుట్ట తేనె విరివిగా లభ్యమవుతుంది. స్వచ్ఛమైన పుట్ట తేనెను స్థానికులు కొండపైకెక్కి తెచ్చుకుంటారు.

దారి తప్పితే ఇబ్బందే..

కొండెక్కేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఆధీనంలో ఉండటం వల్ల ప్రస్తుతం పెద్దపెద్ద చెట్లు, ముళ్లపొదలు పెరిగాయి. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక అంచనా పెట్టుకోవాలి. అలాగైతే కొండ ఎక్కేందుకు గంటన్నర నుంచి రెండుగంటల సమయం పడుతుంది. దారి తప్పితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొండ పైకి వెళ్లేవారు తమవెంట తప్పనిసరిగా గొడుగు, టవల్, తాగునీరు, ఆహారం తీసుకెళ్లాలి.

థ్రిల్లింగ్‌గా ఉంది...

ఇటీవల మా స్నేహితులతో కలిసి వెలగాడ కొండ ఎక్కాను. ఎక్కేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినా కొండపైకి వెళ్లిన తరువాత చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. కొండపైన విజయనగరం రాజులు నిర్మింంచిన కోట, రైల్వేసిగ్నల్‌ బోర్డు ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తే విజయనగరం, నెల్లిమర్ల పట్టణాలతో పాటు చాలా గ్రామాలు కనిపించాయి. 

–పెనుమత్స గణేశ్‌ వర్మ, ఏఓ, మిమ్స్‌ ఆసుపత్రి

చిన్నతనంలో ఆడుకునే వాళ్లం...

మాది కొండవెలగాడ గ్రామం. మా గ్రామాన్ని ఆనుకునే వెలగాడ కొండ ఉంది. మా చిన్నతనంలో ప్రతి రోజు కొండపైకి వెళ్లేవాళ్లం. అక్కడున్న కోటలో ఆటలాడుకునేవాళ్లం.  కొండపైనున్న కొలనులో ఈత కొట్టేవాళ్లం. మండు వేసవిలో కూడా కొండపైన వాతావరణం చల్లగా ఉంటుంది. ప్రభుత్వం కల్పించుకుని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రయోజనముంటుంది.

–దంతులూరి గిరిరాజ్, కొండవెలగాడ  

మరిన్ని వార్తలు