కుళ్లిన మాంసంతో బిర్యానీ

17 Feb, 2018 08:28 IST|Sakshi
తనిఖీల్లో బయటపడ్డ కుళ్లిన మటన్, చికెన్‌ను చూపుతున్న ప్రకాష్‌నాయుడు తదితరులు

మంగళగిరిలోని పలు హోటళ్లలో దారుణం

అధికారుల తనిఖీల్లో వెల్లడైన వాస్తవాలు

తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి): ఎప్పుడో ఒకసారి తనిఖీచేసే అధికారుల తీరుతో కొన్ని హోటళ్ల యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి.. కుళ్లిన మాంసంతో బిర్యానీ వండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని మాంసం దుకాణాలను, బిర్యానీ హోటళ్లను శుక్రవారం రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ సి.ప్రకాష్‌ నాయుడు, మున్సిపల్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ హోటల్‌లో తనిఖీ చేసినా వారం రోజుల నుంచి 10 రోజుల వరకు నిల్వ చేసిన మాంసం, ఆహార పదార్థాలు బయటపడ్డాయి. ఒక్కో హోటల్‌లో అయితే ఫ్రిజ్‌ అడుగుభాగంలో పురుగులు కూడా దర్శనమిచ్చాయని తనిఖీల్లో పాల్గొన్న ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికంగా ఉన్న స్టార్‌ దమ్‌ బిర్యానీ హోటల్‌ యాజమాన్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కుళ్లి కంపు కొడుతున్న మటన్, చికెన్‌లతో బిర్యానీ వండుతున్నట్లుగా గుర్తించి, యాజమాన్యానికి రూ.15వేలు జరిమానా విధించారు. మరోచోట ఏ మాత్రం శుభ్రత పాటించని ఓ మాంసం దుకాణ యజమానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌నాయుడు మాట్లాడుతూ  ఆహార పదార్థాలను నిల్వ ఉంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్‌ యజమానులపై స్థానిక అధికారులు నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని  సూచించారు. తనిఖీల్లో మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వి.నాగేశ్వరరావు, పశంసంవర్థక శాఖ ఏడీ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు