దైవదర్శనానికి వెళితే ఇల్లు దోచారు

15 Jul, 2019 10:05 IST|Sakshi
దొంగలు ఖాళీ చేసిన ఇనుప బీరువా 

సాక్షి, సఖినేటిపల్లి (తూర్పుగోదావరి) : విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని ఆ కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంటిని దొంగలు దోచేశారు. వివరాల్లోకి వెళితే.. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన  గుబ్బల నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులు గల్ఫ్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇద్దరు కోడళ్లు వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కుమార్తె అత్తవారింట్లో ఉంది. నాగేశ్వరరావు దంపతులు తొలి ఏకాదశి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకొనేందుకు శుక్రవారం వేకువజామున విజయవాడ వెళ్లారు. వారు తిరిగి శనివారం రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండడం గమనించిన నాగేశ్వరరావు ఇంట్లోకి వెళ్లకుండా కిటికీలోంచి చూసేసరికి బీరువాలో బంగారం దాచుకున్న బ్యాగ్‌ మంచంపై ఖాళీగా కనిపించింది. దాంతో దొంగలు పడ్డారని గ్రహించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్లూస్‌ టీమ్‌ వచ్చి వేలిముద్రలు తీసుకునేంతవరకు నాగేశ్వరరావు దంపతులు బయటే ఉన్నారు. రాజోలు సీఐ కేఎన్‌ మోహన్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని సందర్శించి సంఘటన జరిగిన తీరుపై నాగేశ్వరరావును ఆరా తీశారు. కాకినాడ నుంచి ఆదివారం వచ్చిన క్లూస్‌ టీమ్‌తో పాటుగా నాగేశ్వరరావు దంపతులు ఇంట్లోకి వెళ్లారు. క్లూస్‌ టీమ్‌ వేలిముద్రలను సేకరించింది.  దొంగలు ఇనుప బీరువాలను బద్దలుకొట్టి వాటిలోని బట్టలు, ఆభరణాలు దాచుకున్న సొరుగులు మంచంపై పడేశారు. రూ. 2 లక్షలు విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, పది తులాల వెండి ఆభరణాలు, నగదు రూ. లక్ష, ఎలక్ట్రికల్‌ సామగ్రి పోయినట్టు నాగేశ్వరరావు పోలీసులకు తెలిపారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పీవీఎస్‌ఎస్‌ఎన్‌ సురేష్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు