హుద్‌హుద్‌ ఇళ్ల రహస్యం

4 Jul, 2019 08:05 IST|Sakshi
వజ్రపుకొత్తూరు మండలం బెండి కొండ వద్ద నిర్మాణంలో ఉన్న హుద్‌ హుద్‌ ఇళ్లు 

సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, పీఎంఎవై–హెచ్‌ఎఫ్‌ఎ– ఏహెచ్‌పీ ఆధ్వర్యంలో హుదూద్‌ ఇళ్ల గృహ సముదాయ నిర్మాణం చేపట్టారు. పలాస నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల నిర్మాణం తలపెట్టారు. వజ్రపుకొత్తూరు మండలం బెండికొండపై 198 ఇళ్లు నిర్మాణం చేపట్టగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సూదికొండ– పారిశ్రామికవాడల మద్యలో నిర్మాణాన్ని తలపెట్టారు. వాస్తవానికి హుద్‌హుద్‌ తుఫాన్‌లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలకు చెందిన బాధితులకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సముద్రతీర ప్రాంతంలో నివసిస్తున్న వారికి నిర్మించాల్సి ఉండగా అప్పటి పలాస ఎమ్మె ల్యే గౌతుశ్యామసుందర శివాజీ తన సొంత ఆలోచనలతో గ్రామీణ ప్రజలకు ఎకనామం పెట్టి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి లోని సూదికొండ పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ డీపట్టా భూములను గుర్తించి ఆదరాబాదరాగా నిర్మాణాలు చేపట్టారు.

స్థానికంగా సమస్యలపై అవగాహన లేమితో ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆమోదంతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నిర్మించిన వాటికి హుద్‌హుద్‌ పేరిట కాకుండా ఎన్‌టీఆర్‌ ప్రత్యేక పట్టణ గహ నిర్మాణ పథకం పేరుతో 192 ఇళ్లు జీప్లస్‌1 పద్ధతిలో చేపట్టారు. మొత్తం గృహ నిర్మాణాల విలువ రూ.9.216 కోట్లు పైగా ప్రభుత్వ నిధులను వినియోగించినట్లు ప్రకటనలు జారీచేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోను ఇంతే నిధులు వెచ్చించారు. వీటిని కాకినాడకు చెందిన డీ.జీ.బి కనస్ట్రక్షన్‌ ప్రై వేటు లిమిటెడ్‌ పేరుతో కంట్రాక్టర్‌కు అప్పగించారు.  పూర్తిగా ప్రజల డబ్బుతో కట్టిన ఈ నిర్మాణాలు తుఫాన్‌ బాధితులకు తప్ప అందరికీ అందాయంటే అతిశయోక్తి కాదు.

కేటాయింపులో గందరగోళం
అయితే ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. కౌన్సిలర్‌కు ఐదు ఇళ్లు చొప్పున మొత్తం 25వార్డులకు చెంది న ఇళ్లు అమ్ముకున్నారనే ప్రచారం జోరుగా సాగింది. మొత్తం 192 ఇళ్లకు అప్పటి ఎమ్మెల్యే శివాజీ లిస్టు ప్రకటించగా పూర్తిగా అందులో పెద్దలకే ఇళ్లు ఉన్నాయని పత్రికలు కోడై కూయడంతో లిస్టు వెనక్కు తెప్పించి అనర్హులను తొలగించారు. అయితే సుమారు 70కుపైగా పేర్లను మాత్రమే కేటాయించా రని మిగిలిన వారిని తొలగించారని అప్పట్లో అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వారు కూడా పదివేల రూపాయలు డీడీ తీయాల్సి ఉన్నప్పటికీ తీయకుండా వారికి ఎలా కేటాయిం చారన్నది అనుమానంగా ఉంది. 

స్కెచ్‌ ఫెయిల్‌
టెక్కలి: టెక్కలిలో సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న హుద్‌హుద్‌ ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. సుమారు 192 ఇళ్ల నిర్మాణానికి 2016 సంవత్సరంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కంకరబందలో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వైపు నిర్మాణాలు జరుగుతుండగా మరో వైపు లబ్ధిదారుల ఎంపిక విషయంలో టీడీపీ కార్యకర్తలు వేసిన పక్కా స్కెచ్‌ ఫెయిలైంది. ఒక వైపు నిర్మాణాలు పూర్తి కాకపోవడం, మరో వైపు ఎన్నికలు సమీపించి ప్రభుత్వం మారడంతో టీడీపీ కార్యకర్తల ఆశలు అడియాసలుగా మారాయి. ప్రస్తుతానికి జీప్లస్‌ త్రీ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 

నాణ్యత లోపం
సోంపేట: సోంపేట మండలానికి 2015లో 128 హుద్‌హుద్‌ ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లోనే లబ్ధిదారులను గుర్తించారు. కానీ నిర్మాణాలను మాత్రం నాసిరకంగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  2016 జూలైలో అప్పటి ఎమ్మె ల్యే బెందాళం అశోక్‌ హుద్‌హుద్‌ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.128 ఇళ్లకు 80 ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు రాగా మిగతా 48 ఇళ్ల నిర్మాణం ప్రారంభంలోనే ఉంది. అయితే లబ్ధి దారుల ఎంపికలో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.  అక్రమాల కేటాయింపులు

అక్రమాల కేటాయింపులు
సెగెళ్ల చిట్టెమ్మ.. ఈవిడ మూడేళ్ల క్రితం మరణించింది. అయితే ఈమె పేరుమీద ఆమె కుమారుడికి హుద్‌హుద్‌ కాలనీలో ఇల్లు కేటాయించారు. లబ్బ సూర్యకుమారి మహాలక్ష్మినగర్‌ కాలనీ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న సిరిపురపు భాస్కరరావుకు బంధువు. ఈమెకు కూడా  ఇంటిని కేటాయించారు. సీర చిట్టెమ్మకు సొంతిల్లు ఉంది. అయినా హుద్‌హుద్‌ ఇంటిని కేటాయించారు. భైరి సంతోష్‌కుమార్‌కు కూడా ఇంటిని ఇచ్చారు. భైరి సంతోష్‌కుమార్, నడిమింటి రాధలు ఒకే కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ వారికి రెండు ఇళ్లను కేటాయించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ సోదరునికి కూడా ఓ ఇంటిని మంజూరు చేసేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అప్పట్లో శ్రీకాకుళంలో ప్రతి వార్డుకు ఓ ఇంటిని కేటాయిస్తూ టీడీపీ నాయకులు చెప్పినవారికే ఇళ్లను కట్టబెట్టారు.


కాశీబుగ్గలో హుద్‌హుద్‌ ఇళ్లు

ఇలా 194 ఇళ్లను టీడీపీ కేడర్‌కు ఎన్నికల ముందు పంచిపెట్టేశారు. కాలనీ నిర్మించి మూడేళ్లు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక జాబితాను గోప్యంగా ఉంచారు. ‘సాక్షి’ ఈ జాబితాను వెలుగులోకి తేవడంతో లబ్ధిదా రుల జాబితాను ఉన్నతాధికారులతో ఆమోదింపజేసేందుకు అప్పటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో ఉన్నతాధికారిని సైతం బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని రప్పించుకొని ఆమోదముద్ర వేయించారు. హుద్‌హుద్‌ ఇళ్ల కేటాయింపుల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం జిల్లా పార్టీ సమావేశంలో పలువురు పార్టీ నాయకులే బహిరంగంగా ఆరోపించి ఆధారాలను సైతం నాయకులు అందజేశారు. అయినా ఫలితం లేకపోయింది.

పనులు కాకుండానే ఫలహారం!
వజ్రపుకొత్తూరు: హుద్‌ హుద్‌ ఇళ్లు అక్రమాలకు కేరాఫ్‌గా మారాయి. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి కొండ వద్ద  రూ.8.70 కోట్లతో 192 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పనులు పూర్తి కాకుండానే అప్పటి ఎమ్మెల్యే శివాజీ ఫిబ్రవరి 9న ప్రారంభించేశారు. లబ్ధిదారుల జాబి తా కలెక్టర్‌కు పంపించగా ఆయన తిరస్కరించా రు కూడా. మంచినీళ్లపేటలో టీడీపీ నేతలకి కేటాయించిన ఐదు ఇళ్లలో ఒక ఇంటిని రూ.1.50లక్షలకు చొప్పున ఏకంగా వేలానికి పెట్టి రూ.7.50 లక్షలు వసూలు చేశారు. ఇక కొత్తపేట పంచాయతీలో మండల టీడీపీ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి కుటంబ సభ్యులకు కొన్ని ఇళ్లు, పక్క పంచాయతీలోని మరికొందరికి కొన్ని అమ్ముకోగా, పాతటెక్కలి పంచాయతీలో పక్కా ఇల్లు ఉన్న 10 ఎకరాల ఆసామికి హుద్‌ హుద్‌ ఇల్లు కేటాయించారు.

ఇలా ఈ 192 నివాసాలను రూ.1.70 కోట్లకు అమ్మేశారు. వారి పాచికను కలెక్టర్‌ పారనీయకపోవడంతో గమ్మునుండిపోయారు. అయితే ఈ పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. తిత్లీ తుపానులో శిథిలమైన పైప్‌లైన్, ఇతర పనులను నేటికీ పునరుద్ధరించలేదు. కొండకు దిగువన కట్టడంతో వరద ప్రవాహానికి ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తాగునీటి సదుపాయానికి ఓవర్‌ హెడ్‌ ట్యాంకు పనులు ఇంకా ప్రారంభించలేదు. విద్యుత్‌ సదుపాయం కూడా కల్పించలేదు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా