భార్యను చంపిన భర్త

3 Oct, 2013 00:44 IST|Sakshi

 ‘సంబంధా’నికి అడ్డుగా ఉందని అంతం
 దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన మహిళలు  
అనాథలైన చిన్నారులు
దమ్మాయిగూడలో దారుణం

 
 కీసర, న్యూస్‌లైన్: ‘అమ్మా.. లేవమ్మా.. ఏమైందమ్మా నీకు.. లేవమ్మా’ అని ఆ చిన్నారుల రోదనలు కాలనీవాసుల హృదయాలను కలిచివేశాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొంతునులిమి చంపేశాడు. దీంతో ఆ దంపతుల ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. నిందితుడు ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేయగా స్థానిక మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని దమ్మాయిగూడలోని భవానీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన చిరంజీవి(34) ఆరేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన భవానీ(27)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు.  
 
 దంపతులు మూడేళ్ల క్రితం కీసర మండలం దమ్మాయిగూడకు వలస వచ్చారు. చిరంజీవి స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తుండగా భార్య స్థానికంగా ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. వీరికి పిల్లలు భార్గవి, (5) సోని(3), స్వప్న (7 నెలలు) ఉన్నారు. ఇటీవల మద్యానికి బానిసైన చిరంజీవి అదే కాలనీలో ఉంటున్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు భవానీ భర్తతో గొడవపడింది. తన ‘సంబంధా’నికి భార్య అడ్డుగా ఉందని, ఎలాగైనా చంపేయాలని చిరంజీవి పథకం వేశాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు.
 
 అర్ధరాత్రి సమయంలో చిరంజీవి భార్య గొంతునులిమి చంపేశాడు. భవానీ ఆత్మహత్య చేసుకుందని కాలనీ వాసులను నమ్మించాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చీరతో మృతదేహాన్ని వేలాడదీశాడు. బుధవారం తెల్లవారుజామున చిరంజీవి కాలనీవాసులను పిలిచి తన భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పాడు. కాగా ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం, భవానీ చేతి గాజులు ఇంట్లో పగిలి ఉండటం, పుస్తెల తాడు తెగిపోయి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. చిరంజీవికి కాలనీ మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు.
 
 తల్లిపాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి
 చిరంజీవి భార్యను చంపేయడంతో పిల్లలు అనాథలయ్యారు. నిత్యం ఉదయం నిద్రలేపి లాలించే తల్లి విగతజీవిగా పడి ఉండడంతో చిన్నారులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ తల్లికి ఏమైందో కూడా తెలియని ఆ చిన్నారుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. ‘అమ్మా.. లేమ్మా.. ఏమైందమ్మా నీకు’ అని భార్గవి గుక్కపట్టి ఏడ్చిన తీరు హృదయ విదారకం. తల్లి మృతితో పిల్లలు అనాథలయ్యారని కాలనీ వాసులు కంటతడి పెట్టారు. తల్లిపాల కోసం ఏడు నెలల చిన్నారి గుక్కపట్టి ఏడి ్చంది. మృతురాలి బంధువులు వస్తే చిన్నారులను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. చిరంజీవితో పాటు అతడి ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పిల్లలు కాలనీవాసుల వద్ద ఉన్నారు.

మరిన్ని వార్తలు