విభజన హామీలన్నీ నెరవేర్చాలి: ఎంపీ కవిత

9 Feb, 2018 02:28 IST|Sakshi
ఎంపీ కవిత జై ఆంధ్రా అంటూ ప్రసంగం

టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనకు మద్దతిస్తున్నాం

బడ్జెట్‌పై చర్చలో టీఆర్‌ఎస్‌ ఎంపీ ∙రైతుల కోసం ఏం చేశారని ప్రశ్న

కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని వినతి

జై ఆంధ్రా అంటూ ప్రసంగం ముగింపు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. గురువారం ఆమె బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు కొద్దిరోజులుగా చేస్తున్న ఆందోళనకు మా మద్దతు పలుకుతున్నాం. ప్రభుత్వం–పాలన ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వంలో ఉన్న టీడీపీ సభలో ఆందోళన చేస్తుండడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది’’ అని అన్నారు. ‘‘ఈ బడ్జెట్లో రైతు గురించి చేసిందేమీ లేదు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఎలాంటి వ్యూహమూ లేదు. ఎలాంటి కేటాయింపులూ లేవు. గడిచిన మూడేళ్లుగా లేదు. ఇప్పుడూ లేదు. సులభతర వాణిజ్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చారు. 140వ స్థానం నుంచి 100వ స్థానానికి ఎగబాకారు.

వ్యాపారానికి సంబంధించి 31 బిల్లులు తెచ్చారు. కానీ రైతుల గురించి ఏం చేశారు. కేవలం 2 బిల్లులు తెచ్చారు. పెస్టిసైడ్స్‌ బిల్లు, నాబార్డు బిల్లు, విత్తనాల బిల్లు, శీతల గిడ్డంగుల బిల్లు.. ఇలా అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. తొలి బడ్జెట్‌ నుంచే రైతుల ఆదాయం రెట్టింపునకు సంబంధించి కేటాయింపులు ఎందుకు చేయలేదు. ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాలో వేస్తామన్నారు. ఎందుకు చేయలేదు. సాగునీటికి నీళ్లిస్తామన్న ప్రకటనలే తప్ప కేటాయింపులేవీ? మా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరాం. కానీ పురోగతి లేదు. కనీసం రాష్ట్రాలు చేసే ప్రాజెక్టులకైనా సాయం చేయాలి కదా.. ప్రతి రైతును యూనిట్‌గా తీసుకుని ఫసల్‌ బీమా యోజన చేపట్టాలి. కనీస మద్దతు ధర కేవలం 26 పంటలకే ప్రకటిస్తున్నారు. కేవలం 2 వ్యవసాయ ఉత్పత్తులనే కేంద్రం సేకరిస్తోంది. మిగిలిన అన్నింటికీ మద్దతు ధర ప్రకటించాలి’’ అని పేర్కొన్నారు. అప్పటికే తనకు కేటాయించిన సమయం పూర్తయిందని సభాపతి ప్రకటించడంతో చివరగా ‘‘విభజన హామీలు నెరవేర్చాలి.. జై ఆంధ్రా.. ’ అంటూ ప్రసంగం ముగించారు. 

మరిన్ని వార్తలు