అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన

19 Jun, 2017 09:49 IST|Sakshi
అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన

► ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలారు
► ప్లీనరీకి పార్టీ శ్రేణులు తరలి రావాలి
► వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి


కడప అగ్రికల్చర్‌: అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్‌ సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆదివారం కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ తన మేనిఫెస్టోలో 600 హామీలతో కూడిన బుక్‌లెట్‌ విడుదల చేసిందన్నారు.

ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఆ హామీలను నెరవవేర్చలేదని ప్రశ్నిస్తే ప్రతిపక్షనేతలపైన, ప్రజలపైన కేసులు పెట్టారన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి విమానయాన సిబ్బందిపై దాడికి తెగబడితే ఇది తప్పు ఇలా చేయకూడదని సీఎం చెప్పిన పాపాన పోలేదంటే దీని అర్థం ఇలానే చేయండి మనకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామన్నట్లు ఉందని అన్నారు. సీఎం, ఆయన తనయుడు లోకేష్‌ కనుసన్నల్లోనే భూ కుంభకోణాలు, ఇసుక మాఫీయాలు, అక్రమాలు రాష్ట్రంలో విచ్చల విడిగా చోటు చేసుకుంటున్నా నోరు మెదపలేదన్నారు.


నవనిర్మాణ దీక్షలు ఎందుకో..:
నవనిర్మాణ దీక్షలను ఎందుకు నిర్వహించారో అర్థం కావడంలేదని సాక్షాత్తు అధికారులే అన్నారని, ఎక్కడ అభివృద్ధి జరిగిందని, సీఎం, ఆయన కొడుకు, ఆ పార్టీ నేతలు ప్రతి పనిలోనూ దోచుకుతింటున్నారని అధికారులే చెబుతున్నారన్నారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.

మరిన్ని వార్తలు