కమిషనర్‌ ఇంటి వెనుక.. ‘అధికార’ దొంగలు

27 Jul, 2018 14:07 IST|Sakshi

ఖాళీ స్థలం కబ్జా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం!

ఇప్పటికే పునాదుల కోసం తవ్వకం

రాత్రి వేళల్లోనే పనులు

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికార పార్టీ దొంగలు ఏకంగా మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఇంటికే కన్నం పెట్టారు. ఇప్పటివరకు కాంట్రాక్టులు, కమీషన్లకు పరిమితమైన వారు.. ఇప్పుడు కమిషనర్‌ బంగ్లా వెనుక ఉన్న ఖాళీ స్థలంపై కన్నేశారు. అందులో ఏకంగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో మాత్రమే పనులు చేస్తున్నారు. ఇప్పటికే పునాదుల కోసం తవ్వేశారు. ఒకవేళ అధికారికంగా అనుమతులు తీసుకుని ఉంటే దర్జాగా పనులు చేయకుండా.. దొంగతనంగా రాత్రిళ్లు మాత్రమే చేయడం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నగర నడిబొడ్డున పాత కంట్రోలు రూం పక్కనే కమిషనర్‌ బంగ్లా ఉంది. ఎవరు కమిషనర్‌గా వచ్చినా ఈ బంగ్లాలోనే ఉంటారు. దీని వెనకవైపు భారీగా ఖాళీ స్థలం ఉంది. ఒకవేళ ఏవైనా పశువులు ఉన్నా కట్టేసుకునేందుకు అనుగుణంగా ఉంది. ఈ ఖాళీ స్థలం నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండులోకి వెళ్లే వీలుంది. ఇందుకోసం ప్రత్యేకంగా చిన్నగేటు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఖాళీ స్థలంపై.. అదీ బంగ్లా కాంపౌండు గేటు లోపల ఉన్న  స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇక్కడ షాపులు కడితే భారీగా అడ్వాన్స్‌తో పాటు బాడుగ కూడా వచ్చే వీలుంది. దీంతో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే పనులు కానిస్తున్నట్టు తెలుస్తోంది.  

అనుమతులు లేకుండానే..
కమిషనర్‌ బంగ్లా వెనకభాగాన షాపుల నిర్మాణానికి అనుమతి తీసుకునేందుకు గతంలో ప్రయత్నించా రు. పాలకవర్గం నుంచి అనుమతి తీసుకునే ప్రయ త్నం కూడా చేశారు. అయితే, తదనంతరం వచ్చిన కమిషనర్‌ మూర్తి.. బంగ్లా స్థలాన్ని తీసుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. పైగా ఈ స్థలాన్ని ఇచ్చేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. ఇప్పుడు మళ్లీ అధికారపార్టీ నేతలు  ప్రయత్నాలు ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పుడు నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు కాబట్టి పాలకవర్గమూ లేదు. అందువల్ల కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే,  కలెక్టర్‌ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. 

భారీగా వసూళ్లుకంట్రోలు రూం నుంచి ప్రధాన రోడ్డుకు ఉన్న షాపులకు వెనుకవైపునేకమిషనర్‌ బంగ్లా ఉంది. సరిగ్గా ఈ షాపుల వెనకాలే ఖాళీ స్థలం ఉంది. ఇందులో షాపు రూములు కడితే ప్రధాన రోడ్డులో ఉండే షాపులకు అనుబంధంగా తయారవుతాయి. అంటే రోడ్డుపై ఉండే షాపులకు ఎంత గిరాకీ ఉంటుందో అదే స్థాయిలో వీటికీ వస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు భారీగా డబ్బు తీసుకుని ఈ షాపులను నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో కార్పొరేషన్‌ అధికారులు కిమ్మనడం లేదు.

మరిన్ని వార్తలు