విద్యావ్యవస్థ బలోపేతానికి పటిష్ట చర్యలు 

22 Jun, 2019 08:23 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్యనారాయణ, చిత్రంలో జేసీ–2 సుబ్బరాజు,  ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి తదితరులు

పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు 

విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్‌ సత్యనారాయణ

సాక్షి, అనంతపురం అర్బన్‌: ‘‘విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ‘అమ్మఒడి’ పథకం ద్వారా రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో రూపురేఖలు మారనున్నాయి. ఉపాధ్యాయులు కూడా తగు చర్యలు తీసుకుని విద్యార్థులను  ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ’’ అని కలెక్టర్‌ సత్యనారాయణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో విద్యావ్యవస్థపై ఎంఈఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తక్కువగా ఉందంటూ కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీల నుంచి మొదటి తరగతిలో కేవలం 18,781 మంది పిల్లలనే చేర్పించడం ఏమిటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. అంగన్‌వాడీల్లో పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటే ఇంత తక్కువ మంది చేరినట్లు నివేదికలే చెబుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులంటే తనకు గౌరవమని, దానిని నిలుపుకోవాలన్నారు. 80 శాతం కంటే లక్ష్యం తక్కువ చేసిన వారికి మెమోలు జారీ చేయాని డీఈఓ దేవరాజ్‌ను ఆదేశించారు. బడిబయటి పిల్లలను చేర్పించడంలోనూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. అమ్మ ఒడితో పాటు ఇతర కార్యక్రమాలను విస్తృతంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 2.69 లక్షల మంది విద్యార్థులకు యూనిఫారం త్వరిగతిన అందజేయాలన్నారు.
 


సమావేశానికి హాజరైన ఎంఈఓలు  

పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పాఠశాలల్లో టాయ్‌లెట్లు నిర్మిస్తే... వాటిని ఎందుకు వినియోగించడం లేదని కలెక్టర్‌ ప్రశ్నించారు. రొద్దం మండలం పెద్ద మణుతూరు పాఠశాలను తాను సందర్శించిన సమయంలో టాయ్‌లెట్‌కు తాళం వేసి ఉందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలతో కలిసి సహఫంక్తి భోజనం చేయాలని చెప్పారు.

ఉపాధ్యాయులు గైర్హాజరైతే చర్యలు 
ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు హాజరుకావాలన్నారు. కొందరు టీచర్లు స్కూల్‌ సమయం కంటే ముందే ఇళ్లకు వెళుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఉపాధ్యాయుల హాజరును ఎంఈఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాలలకు తాను అకస్మిక తనిఖీకి వస్తానని... ఎక్కడైనా ఉపాధ్యాయులు గైర్హాజరైనట్లు తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు (వార్డెన్లు), మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లందరూ స్థానికంగా ఉండాలని ఆదేశించారు.

అనంతరం మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలల్లో పరిశుభ్రత, తదితర అంశాలపై మండలాల వారీగా కలెక్టర్, జేసీ–2 సమీక్షించారు.  సమావేశంలో జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్టీ సంక్షేమ శాఖాధికారి కొండలరావు, బీసీ సంక్షేమ శాఖ అధకారి రబ్బానిబాషా ఇతర అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు