అప్ర‘మట్టం’

8 Sep, 2019 11:35 IST|Sakshi
విజ్జేశ్వరం కాటన్‌ బ్యారేజీల నుంచి సముద్రంలోకి భారీగా విడుదల చేస్తున్న వరద నీరు

 పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

 పొంగుతోన్న ప్రాణహిత, ఇంద్రావతి

ప్రమాదస్థాయికి నీటి ప్రవాహం

 జలదిగ్బంధంలో 19 నిర్వాసిత గ్రామాలు

ధవళేశ్వరం వద్ద  10.60 అడుగుల నీటిమట్టం

సముద్రంలోకి  8.44 లక్షల క్యూసెక్కులు

సాక్షి, నిడదవోలు/పోలవరం రూరల్‌: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉప నదులు ప్రాణ హిత, ఇంద్రావతి పొంగిపొర్లుతున్నాయి. వీటికి కొండ కోనల్లో కురుస్తున్న వర్షం నీరు తోడవడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద శనివారం అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ప్రవాహం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నదిలోకి ప్రస్తుతం సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం 36 అడుగుల నీటిమట్టం ఉండగా క్రమంగా పెరుగుతూ శనివారం సాయంత్రం 6 గంటలకు 42.20 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద రాత్రి 10 గం టలకు 42.70 అడుగుల నీటి మట్టం చేరింది. 43 అ డుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.60 గోదావరి నీటి మట్టం న మోదయ్యింది. గోదావరి విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్‌ బ్యారేజీల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 175 గేట్లను ఎత్తి 8,84,930 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ధవళేశ్వరం బ్యారేజీలో 70 గేట్లు, ర్యాలీ వద్ద 43 గేట్లు, మద్దూరు వద్ద  23 గేట్లు, విజ్జేశ్వరం వద్ద 39 గేట్లను పూర్తిగా పైకి ఎత్తి వరద నీటికి సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని, రెండు రో జుల్లో సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేసే అవకాశం ఉందని ధవళేశ్వరం హెడ్‌వర్క్స్‌ ఈఈ ఆర్‌.మోహన్‌రావు తెలిపారు. ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం వద్ద 10.50 మీటర్లు, పేరూరు వద్ద 13.50 మీటర్లు, దుమ్మగూడెం వద్ద 12.25 మీటర్లు, కుంట వద్ద 10.24 మీటర్లు, కొయిదా వద్ద 21.26 మీటర్లు, కూనవరం వద్ద 16.48 మీటర్లు, పోలవరం వద్ద 12.32 మీటర్లు, రాజమండ్రి బ్రిడ్జి వద్ద 15.82 మీటర్ల నీటి మట్టాలు నమోదయ్యాయి.

డెల్టాలకు నీటి విడుదల క్రమబద్ధీకరణ..
ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు రైతుల వ్యవసాయ అవసరాల మేరకు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. జిల్లాల్లో వర్షాలు కురవడంతో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమ డెల్టాకు 6,000, మధ్య డెల్టాకు 1,700, తూర్పు డెల్టాకు 3,000 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో ఏలూరు కాలువకు 1,447, తణుకు కాలువకు 364, నరసాపురం కాలువకు 1,888, అత్తిలి కాలువకు 299 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయగా ఉండి కాలువకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు.

జలదిగ్బంధంలో నిర్వాసిత గ్రామాలు 
పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీలోని 19 గ్రామాల నిర్వాసితులు జలది గ్బంధంలో చిక్కుకున్నారు. వీరు పోలవరం చేరుకునే పరిస్థితి లేదు. లాంచీల సదుపాయం కూడా లేదు. రోడ్డు మార్గం మొత్తం వరద నీరు చేరడంతో రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. వరద పూర్తిగా తగ్గితే తప్ప పోలవరం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. పోలవరం వద్ద 12.32 మీటర్ల నీటిమట్టానికి వరద చేరింది. పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌వే పై నుంచి కూడా వరద నీరు దిగువకు చేరుతోంది.

అన్ని చర్యలు చేపడుతున్నాం..
వరదలు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నామని పోలవరం తహసీల్దార్‌ ఎన్‌.నరసింహమూర్తి తెలిపారు. కొత్తూరు కాజ్‌వే వద్ద ఇంజిన్‌ పడవను ఏర్పాటు చేశామన్నారు. వరద తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వీఆర్వోలు ఆయా గ్రామాల్లో ఉన్నారని, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు.

పాత పోలవరంలో భయం భయం..
గోదావరి వరద మరోసారి పెరుగుతుండటంతో పాత పోలవరం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం శివారు పాత పోలవరం ప్రాంతంలో నెక్లెస్‌బండ్‌ లంక గట్టు సుమారు 600 మీటర్ల వరకు కోతకు గురైంది. వరద ఉధృతికి ఇప్పటికే లంక గట్టు మొత్తం అండలు అండలుగా జారిపోయి నదిలో కలిసిపోయింది. 6 మీటర్లు వెడల్పు ఉండాల్సిన గట్టు క్రమేపీ కోతకు గురై మీటరు పరిణామంలోకి చేరింది. గట్టు జారిపోయిన ప్రదేశంలో నది వైపు ప్రాజెక్టు ప్రాంతం నుంచి బండరాళ్లను తెచ్చి వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 100 మీటర్లలోపు మాత్రమే ఈ రాయిని వేయడం జరిగింది. అయితే అసలు పూర్తిగా గట్టు కోతకు గురైన ప్రదేశంలో ఏ మాత్రం పట్టిష్ట పనులు జరగలేదు. మరలా వరదలు వస్తే ఆ ప్రాంతంలో గండిపడుతుందేమోననే ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వరద పెరుగుతున్నందున రాళ్లు వేసే పనులు కూడా నిలిపివేశారు. వరద పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అని భయం పాతపోలవరం వాసులను వెంటాడుతోంది.  

మరిన్ని వార్తలు