వంటింట్లో సరుకుల మంట

18 Apr, 2015 03:36 IST|Sakshi

- ఆకాశ మార్గం పట్టిన ధరలు
- ఉడకనంటున్న పప్పులు
- చిటపటలాడుతున్న చింతపండు
- ఎండుమిర్చికి ధరల ఘాటు
- నూనెలు సలసలా

ఏలూరు సిటీ :వంట సరుకుల ధరలు ఆకాశ యానం చేస్తుండటంతో వంటింట్లో మంట రేగుతోంది. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. నెలవారీ బడ్జెట్ అమాంతం పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం పప్పుకూడు తిందామన్నా కష్టమవుతోందని సామాన్యులు బావురుమంటున్నారు. చింతపండుతో చారు పెట్టుకుందామన్నా ధర చూస్తే భయమేస్తోంది.
 
‘ధర’దడలు ఇలా
గడచిన ఆరు నెలల కాలంలో నిత్యావసర సరుకుల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మొన్నటి వరకూ కిలో రూ.82 పలికిన కందిపప్పు ధర ఇప్పుడు రూ.110 నుంచి రూ.115 మధ్య ఉంది. సగటున కిలోకు రూ.30 పెరిగింది. దీంతో కందిపప్పు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెసరపప్పు కిలో రూ.95 నుంచి రూ.110 వరకు ధర పలుకుతోంది. మొన్నటివరకూ రూ.86 ఉండే కిలో మినుముల ధర రూ.96కు పెరిగింది.

వేరుశనగ గుళ్ల ధర రూ.85 నుంచి రూ.116కు ఎగబాకింది. పచ్చి శనగపప్పు కిలో రూ.60, పంచదార కిలో రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కనీసం చింతపండుతో రసం చేసుకుందామన్నా కష్టంగా మారింది. మొన్నటివరకూ కిలో రూ.76 వరకు ఉన్న చింతపండు ధర అమాంతం రూ.140కి పెరి గింది. ఎండుమిర్చి కిలోకు రూ.25 పెరి గింది.  వెల్లుల్లి కిలో రూ.60 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. వీటికి తోడు నూనె ధరలు కూడా దిగిరానంటున్నాయి. వేరుశనగ నూనె కిలో రూ.85నుంచి రూ.95, పామాయిల్ కిలో రూ.55 నుంచి రూ.60, సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో రూ.70 నుంచి రూ.80 వరకు ధర పలుకుతున్నాయి.

మరిన్ని వార్తలు