తుళ్లూరు దేశంలో ధూం..ధాం..! | Sakshi
Sakshi News home page

తుళ్లూరు దేశంలో ధూం..ధాం..!

Published Sat, Apr 18 2015 3:34 AM

CRDA office

 తాడికొండ : తుళ్లూరు మండలం తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు. పదేళ్లపాటు అధికారంలో లేకపోయినా సొంత డబ్బుతో పార్టీని భుజానవేసుకొని మోశాం. తీరా పార్టీ అధికారంలోకి వస్తే తమకే అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో తలుపులు వేసుకొని నిర్వహించిన సమావేశంలో పార్టీలోని ఓ వర్గంపై మరో వర్గం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నట్టు తెలిసింది. కొందరు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తీరుపై మండిపడినట్టు సమా చారం.
 
  కొన్నాళ్ల కిందట తుళ్లూరులో టీడీపీ కార్యకర్తకు మీ-సేవ కేంద్రం ఏర్పాటుకు అవకాశం రాగా, మరో వర్గం నాయకులు అడ్డుకున్నారని, తన మాటను కూడా ఖాతరు చేయలేదని  సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఆరోపించినట్టు తెలిసింది. అనంతరం ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ఒకరిద్దరు నాయకులకు మినహా మిగిలిన  వారికి పనులు జరగటం లేదని ఓ వర్గం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. తమకు అన్యాయం చేస్తే పార్టీ జెండాలతోనే ధర్నా చేస్తామని మరో వర్గం హెచ్చరించినట్టు తెలుస్తోంది.పార్టీ జెండాలను మోసినవారిని గుర్తుంచుకుని, పార్టీ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
 
 తమకు ప్రతిసారీ అన్యాయం జరుగుతుందంటూ పార్టీ నాయకులు కొమ్మినేని సత్యనారాయణ, జమ్ముల శ్రీనివాసరావు తదితరుల మంత్రి ఎదుట వాపోయారు. ఈ విషయాన్ని తాము కొద్ది రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి నాయకులకు భరోసా ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాత్రం తాను అందరిని కలుపుకుని పోతున్నానని చెప్పారు. లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దాదాపు గంటన్నరసేపు చర్చ జరిగింది.
 

Advertisement
Advertisement