‘వంగా’కు ఇండియన్ పోలీస్ మెడల్

15 Aug, 2014 03:58 IST|Sakshi

 ఒంగోలు క్రైం : ఒంగోలులో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా పని చేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొందిన వంగా సుబ్బారెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసిన పోలీస్ పతకాల జాబితాలో సుబ్బారెడ్డి పేరూ ఉంది. రెండేళ్ల పాటు ఒంగోలులో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఇటీవల ఏఎస్పీగా పదోన్నతి పొందారు.

అందులో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్పీలకు పోస్టింగ్‌ల కోసం హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే సుబ్బారెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ రావడంపై ఆ విభాగంలోని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వల్లభపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. 1985 ఎస్సై బ్యాచ్‌కు చెందిన సుబ్బారెడ్డి అం చెలంచెలుగా ఎదిగి ఏఎస్పీ స్థాయికి చేరుకున్నారు. చీరాలలో శిక్షణా ఎస్సైగా విధులు నిర్వర్తించారు.

ఆ సమయంలోనే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ముఖ్యమంత్రి శౌర్య పతకాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొందారు. 2009లో డీఎస్పీగా పదోన్నతి పొంది మొదట సీఐడీలో పని చేశారు. అనంతరం కడప జిల్లా మైదుకూరు డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్సైగా జిల్లాలోని కంభం, మార్టూరు, అద్దంకి, మేదరమెట్లతో పాటు పలు పోలీస్‌స్టేషన్లలో పని చేసి జిల్లాతో అనుబంధం పెంచుకున్నారు. ఆ తర్వాత సీఐగా గుంటూరు జిల్లా మా చర్ల, నెల్లూరు జిల్లా కావలి, గుడూరు, సూళ్లూరుపేటలో పని చేశారు.

జిల్లాలోని పలు సర్కిళ్లలో సీఐగా విధులు నిర్వర్తించారు. ఆయన పోలీస్ విభాగంలో చేరినప్పటి నుంచి సీఎం శౌర్యపతకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, ఉత్తర సేవా పతకాలు ఆయన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యున్నత సేవా పతకం ఇండియన్ పోలీస్ మెడల్‌ను అక్కున చేర్చుకున్నారు.

మరిన్ని వార్తలు