వియత్నాం చేరుకున్న భారత యుద్ధనౌకలు

25 Sep, 2017 01:27 IST|Sakshi

విశాఖ సిటీ: యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన తూర్పు నౌకా దళానికి చెందిన యుద్ధ నౌకలు వియత్నాం దేశానికి  చేరుకున్నాయి. ఐదు రోజుల పాటు వియత్నాంలోని హాయ్‌పాంగ్‌ పోర్టులో ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ నౌకలు ఉంటాయి. భారత నౌకలకు వియత్నాం నేవీ అధికారులు అక్కడ సాదర స్వాగతం పలికారు. అనంతరం వియత్నాం బోర్డర్‌ గార్డు బృందం ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ నౌకలను పరిశీలించి వాటి పనితీరు, విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదే ళ్లు దాటిన సందర్భంగా నేవీ అధికారులు దౌ త్య అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన మేరీటైమ్‌ బిజినెస్‌ మీట్‌లో ఇరు దేశాల కమాండింగ్‌ అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక, రక్షణ, సంస్కృతి, శాస్త్ర సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించారు.

సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఇరు దేశాల యుద్ధ నౌకలు, విమానాల సందర్శన, రక్షణ పరిశ్రమ సహకారం, రక్షణ రంగంలో శాస్త్రీ య అంశాల అందిపుచ్చుకోవడం, వీపీఎన్‌ నౌకలు, సబ్‌మెరైన్ల మరమ్మతులపైనా మొదలైన అంశాలపై భారత్, వియత్నాం దేశాలు మధ్య ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఐదు రోజుల అనంతరం.. వియత్నాం నుంచి బయలుదేరనున్న ఈ యుద్ధ నౌకలు కాంబోడియా, ఫిలిప్పీన్స్, దక్షిణకొరియా, జపాన్, బ్రూనె, రష్యాకు చెందిన 12 పోర్టులను సందర్శించనున్నాయి. మూడు నెలల పాటు ఆయా దేశాల్లో జరిగే విన్యాసాల్లో సాత్పురా, కద్మత్‌ నౌకలు పాలుపంచుకోనున్నాయి. నవంబర్‌లో దక్షిణాసియా దేశాల సంఘం థాయ్‌లాండ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూలోనూ, మలేషియాలో జరిగే హ్యూమనిటేరియన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌(హార్డ్‌)లోనూ తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు పాల్గొంటాయి.

మరిన్ని వార్తలు