మిషన్‌ కర్నూలే ఎజెండా 

7 Nov, 2019 07:45 IST|Sakshi

సాక్షి, కర్నూలు(సెంట్రల్‌): విద్య, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా యంత్రాంగం నిర్దేశించుకున్న మిషన్‌ కర్నూలే ఎజెండాగా జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్‌ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. కర్నూలులోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు.  

అభివృద్ధిపై ‘ప్రత్యేక’ దృష్టి 
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం జిల్లా యంత్రాంగం.. మిషన్‌ కర్నూలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకాధికారులు ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. రాత్రి బస చేయడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై  దృష్టి సారిస్తారు.

వారంలో ప్రతిరోజు ఒక్క పాఠశాలను, ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ఆ సమయంలో వచ్చిన సమస్యలను నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందజేస్తే వారాంతరం జరిగే సమీక్ష సమావేశంలో వాటికి పరిష్కారం చూపుతారు. ఏదైనా పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీకి వెళితే అక్కడ విద్యార్థులు తమకు తాగునీరు లేదని, మరుగుదొడ్లు పనిచేయడంలేదని, తరగతి గదుల కొరత ఉందని చెబితే వాటిని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు.

అలాగే ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, 500 రకాల మాత్రలు, పారిశుద్ధ్యం, వైద్య పరికారాలు అందుబాటులో లేకపోతే కల్పించానికి చర్యలు తీసుకుంటారు. అలాగే గత సమీక్ష సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు, వాటికి పరిష్కారాలపై లోతైనా విశ్లేషణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తనిఖీలు,రాత్రి బసలేవీ? 
మిషన్‌ కర్నూలులో భాగంగా విద్య, వైద్య శాఖల్లో సమస్యలను నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఇతర జిల్లా అధికారులు తనిఖీలు, రాత్రి బస చేసి స్వయంగా తెలుసుకోవాలి. అయితే ఎక్కడా తనిఖీలు లేవు. రాత్రి బసలు చేయడంలేదు. జిల్లా కలెక్టర్‌ ఇటీవల కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, పీహెచ్‌సీని తనిఖీ చేశారు. గూడూరులోని కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేశారు.

ఇక జాయింట్‌ కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌–2, ఇతర ఉన్నతాధికారులు, నియోజకవర్గ అధికారులుగాని తనిఖీ చేయడంలేదు.ఇలా అయితే స్వయంగా సమస్యలను తెలుసుకోవడానికి అధికారులకు ఎలా వీలు అవుతుందో వారే చెప్పాలి.

పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో అంతంత మాత్రమే వైద్యం
జిల్లాలో 87 పీహెచ్‌సీలు, 18 సీహెచ్‌సీలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో నామమాత్రపు వైద్యం అందుతోంది. రోడ్డు ప్రమాదాల బాధితులకు వైద్యం సక్రమంగా అందడంలేదు. ప్రాథమిక చికిత్స చేసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, ఆదోని ఏరియా ఏసుపత్రి, నంద్యాల జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఏరియా ఆసుపత్రుల్లో సదుపాయాలను పెంచాల్సి ఉంది. కర్నూలు పెద్దాసుపత్రిలో ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌ సేవలను విస్తృత పరచాలి.

మిషన్‌ కర్నూలులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పదో తరగతిలో వంద శాతం ఫలితాలను సాధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదంతా జరగాలంటే ఎక్కడిక్కడే పర్యవేక్షణ చేసే అధికారులు ఉండాలి. విద్యాశాఖను పర్యవేక్షణాధికారుల ఖాళీలు వేధిస్తున్నాయి. ఆదోని, నంద్యాల, డోన్‌ డిప్యూటీడీఈఓ పోస్టులతో 17 మండలాలకు ఎంఈఓలు లేరు. కొన్ని పాఠశాలల్లో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ గాడి తప్పింది. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు