సీఎం ఆదేశాలు తక్షణమే అమలు

26 Oct, 2019 03:50 IST|Sakshi

ప్రజాప్రయోజనార్థం వెంటనే ఉత్తర్వులు 

నిబంధనలు అమలు చేయకపోతే సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీసులు

సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజనార్థం ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి/సీఎం కార్యాలయం (సీఎంవో) పంపించే ఆదేశాలపై ఉత్తర్వుల(జీవో) జారీకి నిర్ధిష్ట గడువు (టైమ్‌లైన్‌) విధించింది. ముఖ్యమంత్రి/సీఎంవో ఈ–ఆఫీసు రూపంలో పంపించే ఫైలు సంబంధిత శాఖలకు చేరిన తర్వాత నిర్ధిష్ట గడువులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర్వులు జారీ కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం ఆదేశాల తక్షణ అమలే లక్ష్యంగా ఉత్తర్వుల జారీ కోసం బిజినెస్‌ రూల్స్‌ను సవరించింది. దీనిప్రకారం ముఖ్యమంత్రి/సీఎంవో అధికారులు ఎండార్స్‌మెంట్‌ చేసిన ఫైళ్లను ఔట్‌టుడే,  మోస్ట్‌ ఇమ్మీడియట్‌ (అత్యంత తక్షణం), ఇమ్మీడియట్‌ (తక్షణం) అనే విభాగాల్లో ఈ–ఆఫీసు ద్వారా సంబంధిత శాఖల కార్యదర్శులకు పంపుతారు.

ఇవి సంబంధిత విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శికి చేరిన తర్వాత ఒక్క రోజులోనే ఉత్తర్వులు జారీ చేయాలి. మోస్ట్‌ ఇమ్మీడియట్‌ కేటగిరీ కింద వచ్చిన  ఫైళ్లకు సంబంధించిన జీవోలను 5 రోజుల్లో జారీ చేయాలి. ఇమ్మీడియట్‌ కేటగిరీ కింద వచ్చే ఫైళ్లకు సంబంధించిన జీఓలను 15 రోజుల్లో జారీ చేయాలి. ఇలా నిర్ధిష్ట సమయంలో సంబంధిత శాఖల అధికారులు (ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు) జీఓలు జారీ చేయడంతోపాటు చర్యల నివేదికను కూడా సీఎం/సీఎంఓకు తెలియజేయాలి. ఈ టైమ్‌లైన్‌ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్‌ నోటీసులు జారీచేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్‌ రూల్స్‌లోని సెక్షన్‌ 4, రూల్‌ 20కి సవరణలు  చేసినట్లు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం జీవో జారీ చేశారు.

గడువు ఉల్లంఘిస్తే..
జీఓల జారీలో ఎవరైనా నిర్ధిష్ట గడువు పాటించకుండా ఉల్లంఘిస్తే సీఎం సంబంధిత ఫైలును వెనక్కు తెప్పించుకుని, జాప్యానికి కారణాలు పరిశీలించి, సంబంధిత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తారు. తదుపరి ముఖ్యమంత్రి ఈ జీఓ జారీ బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి గానీ, ఇతర ఏ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శికి గానీ అప్పగించవచ్చు. సీఎం అప్పగించిన బాధ్యతల ప్రకారం వారు ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం జీఓ జారీ చేస్తారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తుందని భావించే జీఓలు, అంతర్గత ఆదేశాలు (మెమో) జారీ చేయాలంటే ముందుగా ముఖ్యమంత్రి/ముఖ్య కార్యాలయ అధికారులకు పంపించి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా